
మహిళా పోలీసుల బదిలీల్లో అవస్థలు
● గుంటూరు అర్బన్ నుంచి సుదూర ప్రాంతాలకు బదిలీలు ● తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన
నగరంపాలెం: గ్రామ, వార్డు సచివాలయాల బదిలీల పక్రియ గందరగోళంగా మారిందని మహిళా పోలీసులు వాపోయారు. బదిలీల దరఖాస్తుల్లో ఐదు ఆప్షన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వందల కిలో మీటర్ల దూరం బదిలీలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ నినదించారు. గత నెల 28న గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే మహిళా పోలీసుల బదిలీల పక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని మహిళా పోలీసులు ఆయా డీపీఓల్లో దరఖాస్తులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బదిలీల పక్రియ ముగిసి, పోస్టింగ్‌లు కల్పించారు. ఒక్కసారిగా మహిళా పోలీసుల్లో ఆందోళన మొదలైంది. గుంటూరు అర్బన్ జిల్లాలోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే వారికి పల్నాడు, బాపట్ల జిల్లాలను కేటాయించారని వాపోయారు. కనీసం ఐదు ఆప్షన్లల్లో ఒకట్రెండు వాటికి దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు. ఏడు నెలల బాబు ఉన్నాడని దరఖాస్తులో తెలియజేసినా గుంటూరు అర్బన్ నుంచి మేడికొండూరు మండలం రూరల్‌కు బదిలీ చేశారని ఓ మహిళా పోలీస్ వాపోయింది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారి అందుబాటులో లేరని చెప్పడంతో డీపీఓ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో చంటి బిడ్డలతో వచ్చిన వారు సైతం వెనుదిరిగి వెళ్లారు.