
పని విధానంలో మార్పు రాకపోతే కఠిన చర్యలు
శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై మంత్రి మనోహర్ ఆగ్రహం
తెనాలి అర్బన్: ‘‘ఉదయం 10గంటలు అయినా రోడ్లపై ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది.. ప్రతి రోజు ఉదయాన్నే చెత్త సేకరణ చేయాలని ఇప్పటికే ఆదేశించినా.. మీలో మార్పు రావడం లేదు.. మీరు ఇక మారారా ?’’ అంటూ శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం మరొకసారి ఈ ప్రాంతానికి వస్తానని.. ఆ లోపు కొత్తపేటలో వ్యర్థాలు కనిపించకూడదంటూ హెచ్చరించారు. కొత్తపేటలో శుక్రవారం ఆయన పర్యటించారు. రోడ్లపై చెత్త ఉండటాన్ని గమనించిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాల్వల్లో వ్యర్థాలు పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన ఆయన వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. పని విధానంలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మహిళ మండలి భవనాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వచ్చే వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇన్‌చార్జి ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, ఏఈ సూరిబాబు, మంత్రి ఓఎస్‌డీ ఏసురత్నం, ఏసీపీ శివన్నారాయణ, పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.