కర్మకాండలు చేయడానికి వెళ్తూ మృత్యుఒడికి..
నాదెండ్ల: కర్మకాండలు చేయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో జంగం దేవర దుర్మరణం పాలైన విషాద ఘటన జాతీయ రహదారిపై గణపవరం ప్రసన్నవంశీ స్పిన్నింగ్ మిల్లు సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపవరం గ్రామానికి చెందిన మామిడి వీరలింగం (70) జంగం దేవరగా కర్మకాండలు నిర్వహిస్తుంటాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులుగా కాగా, చిన్నకుమారుడు శివలింగం కుల వృత్తిలోనే కొనసాగుతున్నాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో తిమ్మాపురంలో ఓ మృతునికి కర్మకాండలు నిర్వహించేందుకు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వీరలింగం బయలుదేరాడు. ప్రసన్నవంశీ స్పిన్నింగ్ మిల్లు వద్దకు రాగానే సర్వీసు రోడ్డు నుంచి హైవే ఎక్కుతుండగా, చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపునకు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనం ఇరవై అడుగుల దూరంలో పడగా, వీరలింగం అక్కడికక్కడే మృతి చెందాడు. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. సమాచారం తెలుసుకున్న నాదెండ్ల ఎస్సై పుల్లారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరలింగం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో జంగం దేవర మృతి
కర్మకాండలు చేయడానికి వెళ్తూ మృత్యుఒడికి..


