ఘనంగా జననేత జన్మదిన వేడుకలు
కేక్ కటింగ్, స్వీట్స్ పంచుకున్న ప్రజలు, నేతలు, కార్యకర్తలు భారీగా రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున అన్నదానం చేసిన అభిమానులు జగనన్న సుపరిపాలన గుర్తుచేసిన నియోజకవర్గ సమన్వయకర్తలు
పల్నాడు జిల్లా వ్యాప్తంగా సంబరాలు
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తమ అభిమాన నేత పుట్టినరోజు సందర్భంగా వాడవాడలా కేక్ కటింగ్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. పలు గ్రామాలలో అన్నదానం చేశారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య క్యాంపులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున జగనన్న పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తమ ప్రత్యేక అభిమానాన్ని చాటారు. వ్యవసాయ కూలీలు పంట పొలాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
చిలకలూరిపేట నియోజకవర్గంలో...
సమ సమాజమే లక్ష్యంగా సుపరిపాలన అందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త విడదల రజిని చెప్పారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి రజిని నివాసంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ జన్మదిన కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమం అనే పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వైఎస్ జగన్ అని చెప్పారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని భావించి ‘నాడు–నేడు’ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అధునాతనంగా తీర్చిదిద్దారని తెలిపారు. అమ్మ ఒడి పథకం దేశంలోనే ఒక సంచలనం అని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు. అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.
వినుకొండ నియోజకవర్గంలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కేక్ కట్ చేసి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేసిన జగనన్న ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. వినుకొండ నియోజకవర్గంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకరరావు పాల్గొన్నారు. ముందుగా ధరణికోట గ్రామంలో నిర్వహించిన వేడుకలలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం గంటల అమ్మ చెట్టు వద్ద మండల పార్టీ ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరావతిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంనందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంటలమ్మ చెట్టు వద్ద సభలో ఆయన మాట్లాడుతూ 2029లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తథ్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని ఎంతటి కష్టం అయినా నెరవేర్చే ధీశాలి జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు జగన్ అని ప్రశంసించారు. మళ్లీ జగనన్న ప్రజా సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకు అందరం కృషి చేయాలన్నారు. 2029లో జగనన్న పాలన వస్తుందని, కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని కోరారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో...
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20 కేజీల భారీ కేక్ కట్ చేశారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అక్కడే అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎంతో మందికి మార్గదర్శకంగా జగన్‌మోహన్ రెడ్డి నిలిచారన్నారు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అన్నారు. మరో మారు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సైనికుల్లా అందరం కృషి చేద్దామన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించడంతో ప్రజలు సొంత బిడ్డగా, అన్నగా, ఆత్మీయబంధువుగా భావించి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారన్నారు.
గురజాల నియోజకవర్గంలో...
ప్రజాపాలనతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో ఎన్‌ఆర్‌జీ వారు ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత ఐదేళ్ల పాలనలో జగనన్న చేసిన మంచి పనులను వివరించారు. మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశక్యతను తెలియజేశారు. గురజాల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే టీజీవీ కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యనముల మురళీధర్‌రెడ్డి, తదితర ముఖ్యనాయకులు వేరువేరు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు.
ఘనంగా జననేత జన్మదిన వేడుకలు
ఘనంగా జననేత జన్మదిన వేడుకలు


