కొలిక్కి రాని నకిలీ కార్ల వ్యవహారం
అజ్ఞాతంలోకి జనసేన నాయకుడు అతని కోసం ప్రత్యేక బృందాల గాలింపు కార్ల వివరాలు తేల్చాలని రవాణా శాఖను కోరిన పోలీసులు వాహనాలను పరిశీలించి నివేదిక ఇవ్వనున్న రవాణా శాఖ
నరసరావుపేట టౌన్: చిలకలూరిపేట రోడ్డు ప్రమాద కేసుతో వెలుగు చూసిన నకిలీ కార్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. నకరికల్లు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని నరసరావుపేట రూరల్ పోలీసులు విచారిస్తున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో నకరికల్లు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఈ వ్యవహారంలో కీలక నిందితుడుగా భావించి, అజ్ఞాతంలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. సీజింగ్ వాహనాలను తక్కువ ధరకు విక్రయించి వాటిపై రుణాలు తీసుకొని అవి ఎగ్గొట్టేందుకు నకిలీ నంబర్లు అంటించుకొని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అనుమానం ఉన్న 20 కి పైగా వాహనాలను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. వాహనాలకు సంబంధించి నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు అందజేయాలని రవాణా శాఖ అధికారులను పోలీసులు కోరారు. రవాణా శాఖ అధికారులు మూడు వాహనాలకు నంబర్ ప్లేట్లు మార్చినట్లు, చాసిస్ నంబర్ ఆధారంగా తేల్చారు. మిగిలిన వాహనాలను పరిశీలించి నివేదిక సోమవారం నాటికి అందజేయనున్నారు.
నేడు అరెస్ట్ చూపే అవకాశం..
పోలీసుల అదుపులో ఉన్న నకరికల్లు మండలానికి చెందిన అంజి, భానులను సోమవారం పోలీసులు అరెస్ట్ చూపే అవకాశం ఉందని సమాచారం. వీరిద్దరిపై నరసరావుపేట వన్‌టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటికే కేసులు నమోదై ఉన్నాయి. ఈ వ్యవహారంలో నకరికల్లు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. అతని వద్ద నుంచే కార్లు తెచ్చి విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిలకలూరిపేట హైవే రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందిన సంఘటన తర్వాత సదరు జనసేన నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లటం పోలీసుల అనుమానాలకు బలం చేకూరుతోంది. అతను పట్టుబడితే నకిలీ కార్ల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.


