
పెదకాకాని: భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులు దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులకు ఏసీ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ అమ్మిశెట్టి శివశంకరరావు, అర్చకులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం అభిషేకపూజల్లో పాల్గొన్నారు. న్యాయమూర్తి దంపతులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ అమ్మిశెట్టి శివశంకరరావు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
అమరేశ్వరుని సన్నిధిలో..
అమరావతి: బాలచాముండికా సమేత అమరేశ్వరుడిని ఆదివారం అంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు దంపతులు దర్శించుకున్నారు. తొలుత ఆల య ఈఓ వేమూరి గోపినాథశర్మ, ఆలయ అర్చ కులు న్యాయమూర్తి దంపతులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు అమరేశ్వరస్వామికి అభిషేకం, బాల చాముండేశ్వరిదేవికి కుంకుమ పూజలు నిర్వహించారు. అర్చకులు మల్లికార్జునరావు దంపతులకు ఆశీర్వచనం అందించి స్వామి శేషవస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు అందించారు.
నాగార్జున కొండపై అమెరికా బౌద్ధ పరిశోధకుల పరిశీలన
విజయపురిసౌత్: నాగార్జునకొండను అమెరికాలో స్థిరపడి బౌద్ధంపై పరిశోధనలు చేస్తున్న ప్రవాస భారతీయులు భాస్కర్, తలాటం నగేష్ బౌద్ధ కేంద్రాల సందర్శనలో భాగంగా ఆదివారం ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డితో కలిసి సందర్శించారు. వీరికి నాగార్జునకొండ మ్యూజియం క్యూరేటర్ కమల్‌హాసన్ స్వాగతం పలికారు. అనంతరం మ్యూజియంలోని బౌద్ధ శిల్పాలు, శాసనాలు, పురావస్తు వస్తువుల గురించి ఇక్ష్వాకుల కాలంలో శ్రీ పర్వత–విజయపురిగా పిలువబడిన నాగార్జునకొండ చారిత్రక విశేషాలను వివరించారు. ఆ తరువాత నాగార్జునకొండపై పునర్నిర్మించిన క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి సింహళవిహారం, మహా స్థూపం, అశ్వమేధ యాగశాల, చైత్యం, మధ్య యుగపు జైన దేవలయాలు, ఇనుప యుగపు సమాధి, రెడ్డి రాజులు నిర్మించిన కోట అవశేషాలను డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. నాగార్జునకొండకు సంబంధించిన బౌద్ధ శిల్పాలు న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శనలో ఉన్నాయని వాటిని తాము చూసిన తరువాత నాగార్జునకొండను చూడాలనిపించి ఇక్కడకి వచ్చినట్లు మహాయాన బౌద్ధ పరిశోధకుడు భాస్కర్, జైన బౌద్ధ పరిశోధకుడు తలాటం నగేష్ తెలిపారు.
రాష్ట్రస్థాయి షూటింగ్
బాల్ విజేత బాపట్ల
మార్టూరు: రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ విజేతగా బాపట్ల జిల్లా జట్టు నిలిచింది. మార్టూరు వివేకానంద నెక్ట్స్‌జెన్ పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 42వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. అండర్–19 బాల బాలికల విభాగంలో నిర్వహించిన పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో గుంటూరు, శ్రీకాకుళం, అనకాపల్లి జట్లు విజేతలుగా నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు వివేకానంద పాఠశాల డైరెక్టర్ వేలూరు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

