
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు తెలిపారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గర్భిణులు, 0 నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా ఇస్తారన్నారు. జిల్లాలోని 630 మంది గర్భిణులు, 0 నుంచి ఏడాది పిల్లలు 959 మంది, 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 652 మంది ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సంచార జాతులు, రోజువారీ కార్మికులు, డ్రాప్ ఔట్లు, లెఫ్ట్ అవుట్లు అందరిపై ప్రత్యేక దృష్టి సారించి వారు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. గర్భిణులు, పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి ఉచితంగా అందించే టీకాలు వేయించుకుని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని సూచించారు.