మార్టూరు: శబరిమల నుంచి అయ్యప్ప భక్తులతో వస్తున్న టూరిస్ట్ బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన మార్టూరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో జరిగింది. అందిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం ఇసుకపల్లి గ్రామానికి చెందిన 22 మంది అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లి తిరిగి స్వగ్రామం వెళ్తున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రహదారిపై వెళ్తున్న వీరి బస్సును అదేమార్గంలో వెనుక నుంచి వెళ్తున్న ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు లోని ఆర్.అప్పలరాజు అనే వ్యక్తికి కుడికాలు విరగడంతో స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ప్రమాదమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.