జయపురం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా జయపురం అటవీ డివిజన్ తరఫున ‘అమ్మ కోసం ఒక మొక్క’ కార్యక్రమం నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జయపురం మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి పాల్గొన్నారు. స్థానిక పీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి నరేంద్ర కుమార్ మహంతి మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పర్యావరణ పరిరక్షణకు అడవులు పెంచాలని అందు చేత ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నేడు మనం నాటే మొక్క జీవరాశి మనగడకు ఉపయోగమే కాకుండా, మన భావి తరాల వారికి ఎంతో మేలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో అటవీ రేంజర్ దేవేంధ్ర మఝి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు.
లోక్ భవన్‌లో ’అటల్ వన్’లో ఏక్ పేడ్ మా కే నామ్
భువనేశ్వర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గురు వారం లోక్ భవన్ ఆవరణలోని ‘అటల్ వన్’లో గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి మొక్కను నాటారు. ఏక్ పేడ్ మా కే నామ్ (తల్లి పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా ఈ మొక్క నాటే కార్యక్రమం జరిగింది. భారత ప్రధాన మంత్రికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్నారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు.
సెంచూరియన్ పబ్లిక్ స్కూల్‌లో
మాస్ ప్లాంటేషన్ డ్రైవ్
పర్లాకిమిడి: మొక్కలను నాటడం ద్వారా మనం పర్యావరణం పరిరక్షించవచ్చని, అలాగే వారి పరిరక్షణకు ప్రతి విద్యార్థి పాటుపడాలని డీఎఫ్‌ఓ కె.నాగరాజు అన్నారు. స్థానిక గజపతి స్టేడియం వద్ద సెంచూరియన్ పబ్లిక్ స్కూల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం పురస్కరించుకుని ‘ఏక్ పేడ్ మా కే నామ్’ 3.ఓ సామూహిక వృక్షారోపణ కార్యక్రమానికి జిల్లా డివిజనల్ అటవీ శాఖ అధికారి కె.నాగరాజు, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ ఇకో క్లబ్ సభ్యులు 76 నర్సరీ మొక్కలను నాటారు. సమావేశంలో ప్రిన్సిపల్ సునీతా పాణిగ్రాహి ముఖ్యవక్తగా పాల్గొన్నారు. విద్యార్థులకు మొక్కలను నాటడమే కాకుండా, వాటి సంరక్షణ బాధ్యత అప్పగించాలని పురపాలక సంఘ చైర్మన్ నిర్మలా శెఠి అన్నారు. కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, స్కూల్ డైరక్టర్(అడ్మిషన్) సంబిత్ పాత్రో, ఏసీఎఫ్ షైనీశ్రీ దాస్, ఫారెస్టు అధికారి సంతోష్ కుమార్ సాహు, మోహన అటవీ రేంజ్ అధికారి బిశోయి తదితరులు పాల్గొన్నారు.


