భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్, భువనేశ్వర్ మధ్య ప్రత్యక్ష అంతర్జాతీయ విమానయానం సేవలు పునః ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 నుంచి ఇండిగో సంస్థ భువనేశ్వర్, బ్యాంకాక్‌ల మధ్య వారానికి 2 రోజులు విమానాలను నడపనుందని అధికార వర్గాలు తెలిపాయి. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం సోమ, శుక్ర వారాల్లో భువనేశ్వర్ నుంచి బ్యాంకాక్‌కు, తిరుగు ప్రయాణంలో మంగళ మరియు శని వారాల్లో బ్యాంకాక్ నుంచి భువనేశ్వర్ మధ్య ఈ సేవలు లభ్యం అవుతాయి. అక్టోబర్ 26 నుంచి బ్యాంకాక్ నుంచి వచ్చే విమానాలు సోమ, గురు వారాల్లో భువనేశ్వర్‌కు చేరుతాయి. భువనేశ్వర్ నుంచి బయలుదేరే విమానాలు మంగళ మరియు శుక్ర వారాల్లో అందుబాటులో ఉంటాయి. విమాన ఛార్జీలు ప్రయాణ తేదీలు, సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. తదనుగుణంగా చార్జీ నిర్ధారణ జరుగుతుంది.
అక్రమ ఖనిజ రవాణా వాహనం స్వాధీనం
రాయగడ: సరైన ధ్రువపత్రాలు లేకుండా డోలమైట్ ఖనిజాన్ని తరలిస్తున్న వాహనాన్ని రాయగడ ప్రాంత రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. 2023 నుంచి వాహనానికి ఫిట్నెస్, బీమా సహా అవసరమైన పత్రాలు అప్‌డేట్ కాకపోవడంతో పాటు పలుమార్లు పన్ను ఎగవేతకు పాల్పడిట్లు ఆన్‌లైన్‌లో గుర్తించారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని సుమారు రూ.3 లక్షల వరకు జరిమానా విధించారు. రాయగడ – కేరడ ప్రధాన రహదారిలోని పితామహాల్ సమీపంలో ఆర్టీవో వినయ్ కుమార్ పాల్ పర్యవేక్షణలో రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలను బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా డోలమైట్ ఖనిజంతో వెళ్తున్న వాహనాన్ని నిలిపి పత్రాలు చూపించాలని కోరారు. అయితే వాహన చోదకుడు ఎలాంటి చెల్లుబాటు ఆయ్యే పత్రాలను చూపించలేకపోయాడు. అనంతరం అధికారులు వాహనం వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలించగా 2023 నుంచి ఫిట్నెస్, బీమా తదితర అవసరమైన పత్రాలు ఆప్‌డేట్ కాలేదని గుర్తించారు. అలాగే వివిధ టోల్‌గేట్ల వద్ద సమారు 7 నుంచి 8 సార్లు పన్ను ఎగవేతకు సంబంధించిన రికార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని జరిమనాను విఽధించారు.


