క్షుద్ర పూజల అనుమానంతో వ్యక్తి హత్య | - | Sakshi
Sakshi News home page

క్షుద్ర పూజల అనుమానంతో వ్యక్తి హత్య

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

12 మంది అరెస్టు

రాయగడ: క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని అడ్డగించి హత్య చేసిన ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్టు చేసారు. జిల్లాలోని గుణుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాకితర గ్రామ సమీపంలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితులనుకోర్టులో హజరుపరిచారు. హత్యకు ఉపయోగించిన కర్రతో పాటు 12 సెల్‌పోన్లు, మృతుడి మోటార్‌ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గుణుపూర్‌ ఆదర్శ పోలీస్‌ స్టేషన్‌ ఐఐసి కేకేబీకే కుహరో ఈ మేరకు గురువారం నాడు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గొట్లపదర్‌ పంచాయతీ పరిధిలోని కాకితర గ్రామానికి చెందిన మాటియా పాతిక (56) సెప్టెంబరు 2 వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆయన ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం లాబా–కాకితర గ్రామాల మధ్య బొంగురు వాగు సమీపంలో మాటియా మృతదేహం, ఆయన బైకు కనిపించాయి. దీంతో మృతుడి భార్య సవర్ణీ పాతికా ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుణుపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మాటియా క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అతడిపై ఆగ్రహంతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గ్రామంలో సామూహిక కార్యక్రమాల్లో కూడా అతడు పాల్గొనకుండా ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. సెప్టెంబరు 2 న మాటియా లాబా వైపు వెళుతున్నట్లు గుర్తించిన నిందితులు అతడిని హత్య చేయాలని పథకం వేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలియజేశారు. బైకుపై తిరిగి వస్తున్న సమయంలో బొంగురు వాగు సమీపంలో అతడిని అడ్డగించి కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు మృతదేహంతో పాటు మృతుని బైకును వాగులో పడేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ కేసులో కాకితర గ్రామానికి చెందిన బిడికా రామచంద్ర, బిడికా రమేష్‌, బిడికా సంతోష్‌, మండంగి లింగరాజ్‌, పాతికా మోసెస్‌, పాతికా యోగేంద్ర, నమల కుమార్‌, బిడికా బాదామా, రవి బిడిక, బిడికా కై లాస్‌, బిడికా రామదాస్‌ అలియాస్‌ బిడికా దాస్‌ , మండంగి కేశవ్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement