మల్కన్‌గిరి: ఢిల్లీలోని పితంపురాలో నిర్వహించిన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్, డెడ్‌లిస్ట్, బెంచ్ ప్రెస్ పోటీల్లో మల్కన్‌గిరి జిల్లాకు చెందిన రాయల్ ఫిట్నెస్ జిమ్ అథ్లెట్ సంజితా హాల్దార్ అద్భుత ప్రతిభ కనబరిచారు. దేశంలోని 17 రాష్ట్రాల నుంచి మొత్తం 568 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఒడిశా నుంచి 20 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వారిలో మల్కన్‌గిరి యువతి సంజితా ఒకరు. బెంచ్‌ప్రెస్‌లో 77.5 కిలోల బరువును ఎత్తి మూడో స్థానం సాధించారు. అలాగే డెడ్‌లిస్ట్‌లో 135 కిలోల బరువును ఎత్తి రెండోస్థానం సాధించి రజిత పతకాన్ని కై వసం చేసుకున్నారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు.
జయపురం జగజ్జననీ మందిర హుండీ ఆదాయం లెక్కింపు
జయపురం: జయపురం ప్రజల ఆరాధ్య దైవం జగజ్జననీ మందిరం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 8 నెలల తర్వాత లెక్కించిన హుండీలో రూ.15, 25, 800 నగదుతో పాటు చిల్లర నాణేలు, బంగారు, వెండి ఆభరణాలు ఎక్కువగా ఉన్నాయి. హుండీలో భక్తులు సమర్పించిన దక్షిణలను ఆలయ కమిటీ సభ్యులు అధికారుల సమక్షంలో రోజంతా లెక్కించారు. హుండీలో భక్తులు రాసి వేసిన 45 లేఖలు ఉన్నాయి. అందులో అమ్మవారికి రాసిన ఆహ్వానాలూ కనిపించాయి. హుండీ లెక్కింపులో మాధవ మహంకుడో, రామా రావు, మాధవ రథ్, లక్ష్మీకాంత పట్నాయిక్, శివ పట్నాయిక్, పూజారి వల్లభ నారాయణ ఖడంగ, బిజయ ఖడంగ, రభి ఖొర, తపన కుమార్ మిశ్ర, విశ్వజిత్ దండసేన, లక్ష్మణ జాని తదితరులు పాల్గొన్నారు.
55 తాబేళ్లు స్వాధీనం
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు అటవీ శాఖ అధికారులు మోటు సరిహద్దు రహదారిలో గురువారం పెట్రోలింగ్ చేపట్టారు. ఈ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్ర నుంచి తాబేళ్లను తీసుకొచ్చి ఒడిశాలో అధిక ధరకు అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మోటు అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టారు. ఎంవీ 114 గ్రామానికి చెందిన ప్రభాస్ జోడహార్, నంద మండాల్, ఎంవీ 47 గ్రామానికి చెందిన లోకిపద్ మాలి, రామ్‌నారాయణ్ మండాల్‌లు 55 తాబేళ్లను అక్రమంగా తీసుకొస్తుండగా స్వాధీ నం చేసుకున్నారు. అలాగే నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
40 కిలోల గంజాయి పట్టివేత
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ అడవ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి పోలీసుల బృందం పెట్రోలింగ్ జరుపుతుండగా, డురింగుడ, ముత్తగుడ రోడ్డులో ఒక టీవీఎస్ స్కూటీలో గంజాయి బస్తాలు తీసుకువెళుతుండగా పోలీసులు ప్రశ్నించి పట్టుకున్నారు. పట్టుకున్న రెండు ముచ్చి బస్తాల్లో ఉన్న గంజాయిని మోహన తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రాజేంద్ర కుమార భుయ్యాన్ సమక్షంలో తూనిక వేయగా 40 కిలోల గంజాయి ఉన్నట్టు నిర్ధారించారు. మార్కెట్‌లో దీని విలువ నాలుగు లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన వ్యక్తి అడవ పంచాయతీ ముత్తగుడ గ్రామానికి చెందిన నర్సింగ్ మాలి అలియాస్ లారెన్స్ (48)గా పోలీసులు గుర్తించారు. అడవ పోలీసు స్టేషన్‌లో కేసు నంబర్ 193/2026 ఎన్.డి.పి.యస్. చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి, ఒక టీవీఎస్ స్కూటీ, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అడవ పోలీసు అధికారి సంతోష్ బిశోయి తెలియజేశారు. నిందితుడు నర్సింగ్ మాలిని మోహన కోర్టులో గురువారం హాజరు పరిచారు.


