పోలీసుల అదుపులో మావోయిస్టు కమాండర్‌..? | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో మావోయిస్టు కమాండర్‌..?

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

రాయగడ: జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు కమాండర్‌, ఏరియా కమిటీ సభ్యుడు సర్వేశ్వర్‌ మాఝి అలియాస్‌ మాంగు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అంబొదల పోలీస్‌స్టేషన్‌ పరిధి హటొదహిఖాల్‌ వారపు సంతలో మాంగును ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ముందస్తుగా వ్యూహం రూపొందించినట్లు సమాచారం. హటొదొహిఖాల్‌ సంతకు మాంగు వస్తాడన్న సమాచారంతో పోలీసులు తెల్లవారుజామునుంచే నిఘా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సమయంలో సరుకులు కొనుగోలు చేసేందుకు సంతకు వచ్చిన మాంగును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పట్టుకునే సమయంలో మాంగు భద్రత సిబ్బందితో పెనుగులాడి అక్కడనుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. మాంగును ప్రస్తుతం ఎక్కడ ఉంచారన్న విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.

నియమగిరిలో మావోయిస్టు కదలికలు

వంశధార – ఘుముసుర – నాగావళి డివిజన్‌లో గతంలో సమారు 25 నుంచి 27 మంది మావోయిస్టు సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలిన వారిలో కొందరు ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత నికిల్‌, ఆయన భార్య ఇందు సహా 15 మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత, మిగిలిన క్యాడర్‌ కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. అయితే అందుకు స్పందించకుండా కొందరు రాయగడ, కందమాల్‌, గంజాం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇదిలా ఉండగా నియమగిరి పర్వత ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను వారు ఆశ్రయంగా ఉపయోగించుకున్నట్లు సమాచారం. మిగిలిన మావోయిస్టులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. మాంగు అదుపులోకి రావడంతో అతడితో సంబంధం ఉన్న ఇతర మావోయిస్టు క్యాడర్‌కు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సర్వేశ్వర్‌ మాఝి అలియాస్‌ మాంగు స్వస్థలం రాయగడ జిల్లా కాసీపూర్‌ సమితి పరిధిలోని పంచాలి గ్రామంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement