పర్లాకిమిడి: రాష్ట్రమంతటా సంచలనం రేపిన గజపతి జిల్లా ఏసీఎఫ్ సౌమ్యరంజన్ మహాపాత్రో హత్య కేసులో ప్రధాన నిందితుడు, అప్పటి డీఎఫ్‌ఓ సంగ్రాం కేసరి బెహరా సోమవారం సబ్ డివిజనల్ సెషన్స్ జడ్జి ఎదుట లొంగిపోయాడు. హైకోర్టులో బెయిల్ అపీల్ చేయగా అక్కడ చుక్కెదురైంది. రెండు వారాల్లో గజపతి ఎస్.డి.జె.ఎం కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లో వెళ్తే.. స్థానిక డీఎఫ్‌ఓ కార్యాలయం కాంపౌండ్‌లోని సిబ్బంది నివాసగృహంలో అప్పటి ఎ.సి.ఎఫ్ సౌమ్యరంజన్ మహాపాత్రో తన గదిలో కాలిపోయి, 90 శాతం గాయాలతో కటక్ మెడికల్‌లో చేరారు. అనంతరం ఆయన చనిపోయారు. అప్పటి డీఎఫ్‌ఓ సంగ్రాం కేసరి బెహరా, కోడలు విద్యాభారతి పండా, వంటవాడు మన్మథ కుంబోపై కోర్టులో సౌమ్యరంజన్ మహాపాత్రో తండ్రి అభిరామ్ మహాపాత్రో కేసు పెట్టారు. అనంతరం నిందితుడు సంగ్రాం కేసరి బెహారా సుప్రీం కోర్టుకు బెయిల్ కోసం అపీల్ చేశాడు. అక్కడ ఆయనకు బెయిల్‌ను నిరాకరించారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పర్లాకిమిడి ఎస్.డి.జె.ఎం కోర్టులల్లో లొంగిపోయారు. అనంతరం జిల్లా కోర్టులో బెయిల్ పిటీషన్ కోసం లాయర్లు దాఖలు చేశారు. సోమవారం సాయంత్రం తరువాత సంగ్రాం బెహారా బెయిల్ పిటీషన్ రద్దు అవ్వడంతో ఆయనను పోలీసులు పర్లాకిమిడి ఉపకారాగారానికి రాత్రి తొమ్మిది గంటల తరువాత తరలించారు. సంగ్రాం కేసరి బెహరా ప్రస్తుతం ఓ.ఎఫ్.డి.సి డైర్‌క్టర్‌గా పని చేస్తున్నారు.


