ఏమైందో ఏమో..? | - | Sakshi
Sakshi News home page

ఏమైందో ఏమో..?

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

రణస్థలం: పురుగుల మందు సేవించి భార్యాభర్తలు బలవన్మరణానికి యత్నించిన ఘటన లావేరు మండలంలో కలకలం సృష్టించింది. లావేరు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలో కోర్టు సమీపంలోని బాయమ్మతోటలో నివాసం ఉంటున్న దవల రామకృష్ణ(62), అతని భార్య శ్రీదేవిలు సోమవారం సాయంత్రం నరసన్నపేట వెళ్తామని చెప్పి ద్విచక్ర వాహనంపై బయ ల్దేరారు. రాత్రి సమయంలో బయట పలు ప్రాంతాలు తిరిగారు. మంగళవారం ఉదయం బయట ఎక్కడో ఎరువుల దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో తాళ్లవలస రెవెన్యూ పరిధి లావేరు రోడ్డు మార్గంలో రోడ్డు పక్క ద్విచక్ర వాహనం పెట్టి సరుగుడు తోటలోని వెళ్లారు. అక్కడ పురుగులు మందును ఇరువురూ సేవించారు. అనంతరం రామకృష్ణ తొలుత భార్య మెడకు వైరు కట్టి, తనుకూడా కట్టుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

భార్య స్పృహలోకి రావడంతో...

కొంత సమయం తర్వాత భార్య స్పృహలోని వచ్చి భర్త విగతజీవిలా పడి ఉండడంతో కుటుంబ సభ్యులకు సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్‌చేసి సమాచారం ఇచ్చింది. అయితే అప్పటికే భర్త మృతి చెందాడు. ఘటన స్థలానికి 108 వాహనం చేరుకుని భార్య శ్రీదేవిని రణస్థలం సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి లావేరు పోలీసులు, క్లూస్‌ టీం చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణ మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుని కుమారుడు కృష్ణసాయి వివాహం చేసుకుని ప్రకాశం జిల్లా గిద్దలూరులో డెంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. కుమార్తె హర్షిత పూణేలో గైనిక్‌ డాక్టర్‌ పనిచేస్తున్నారు. ఈనెల 5వ తేదీన కుమార్తె సీమంతం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. ఎస్‌ఐ వి.సందీప్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

బలవన్మరణానికి భార్యాభర్తలు యత్నం

భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య

ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement