స్వర్ణ భూషణాలు | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ భూషణాలు

Jul 26 2026 7:54 AM | Updated on Jul 26 2026 7:54 AM

రథాలపై మూల విరాట్లకు ..

భువనేశ్వర్‌:

పూరీలోని జగన్నాథ ధామంలో జరిగే అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ఒకటైన స్వర్ణాలంకారంలో మహా ప్రభువు శ్రీ జగన్నాథుడు రాజాధి రాజుగా అన్నా చెల్లెళ్ల సమేతంగా దైవిక సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచాడు. రథంపై అత్యద్భుతమైన బంగారు ఆభరణాలతో అలంకరించబడి అశేష భక్త జనానికి దర్శనం ఇచ్చారు. పవిత్ర ఆషాఢ శుక్ల ఏకాదశి లేదా హరి శయన ఏకాదశి తిథి సందర్భంగా శని వారం రథారూఢ బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని మూల విరాట్లను బంగారు ఆభరణాలతో పరిపూర్ణ మూర్తులుగా రూపు దిద్దారు. మధ్యాహ్న ధూపదీప నైవేద్యాల అనంతరం దివ్య అరుదైన స్వర్ణ అలంకారంలో దేవదేవుళ్లు భక్తులకు దర్శనమిచ్చారు. 3 రథాలలో మూల విరాటుల స్వర్ణ అలంకరణ సాయంత్రం 5.10 గంటలకు ప్రారంభమై 6.35 గంటలకు ముగిసింది. సంవత్సరానికి 5 సార్లు పూరీ జగన్నాథ్‌ ధామంలో స్వర్ణ భూషిత శోభతో భగవంతుని దర్శనం లభిస్తుంది. ఏటా ఆషాఢ శుక్ల ఏకాదశి పురస్కరించుకుని బహుడా యాత్ర తర్వాత రోజున రథాలపై స్వర్ణ ఆభరణాలతో దివ్య దర్శనం లభిస్తుంది. మధ్యాహ్నం ధూపం సమర్పణ తర్వాత ఈ అలంకరణ చేపడతారు. ఏటా కార్తీక పౌర్ణమి నాడు పగటి పూట స్వర్ణ శోభతో స్వామి దర్శనం ఇస్తాడు. ప్రాతః ధూపం తరువాత శ్రీ మందిరం రత్న సింహాసనంపై ఈ దర్శనం ప్రాప్తిస్తుంది. పౌష్య పౌర్ణమి పురస్కరించుకుని ఏటా నిర్వహించే పుష్యాభిషేకం సందర్భంగా మూడో సారి స్వామి దర్శనం స్వర్ణ అలంకారంలో లభిస్తుంది. మధ్యాహ్న ధూపం సమర్పించిన తర్వాత ఈ అలంకరణ చేస్తారు. మరో మారు డోల పౌర్ణమి తిథి నాడు ఉదయం రత్న సింహాసనంపై దేవతా మూర్తులకు ధూప సమర్పణ తర్వాత స్వర్ణ శోభతో స్వామి కాంతులీనుతాడు. చివరగా ఐదో సారి ఏటా అశ్విని శుక్ల దశమి (విజయ దశమి) సందర్భంగా దసరా రోజున ఉదయం రత్న సింహాసనంపై మూల విరాటులకు బంగారం ఆభరణాలతో అలంకరిస్తారు. దసరా నాడు విజయ రామచంద్రుని రూపంలో, కార్తీక పౌర్ణమి నాడు ద్వారకానాథుని రూపంలో, డోల పౌర్ణమి నాడు గోపేశ్వరుని రూపంలో మరియు పౌష్య పౌర్ణమి నాడు పుష్యాభిషేకం సందర్భంగా శ్రీరాముని రూపంలో బంగారు కాంతులతో స్వామి ప్రకాశిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తాడు. ఈ సంప్రదాయం క్రీ.శ. 1460 నాటిదని నమ్ముతారు. ఆ కాలంలో రాజు కపిలేంద్ర దేవ్‌ యుద్ధాలలో విజయం సాధించి స్వాధీనం చేసుకున్న అపారమైన యుద్ధ సంపదన బంగారు ఆభరణాలను సమర్పించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement