లైంగికదాడి కేసులో నిందితుడికి పదేళ్లు జైలు | - | Sakshi
Sakshi News home page

లైంగికదాడి కేసులో నిందితుడికి పదేళ్లు జైలు

Jul 26 2026 7:54 AM | Updated on Jul 26 2026 7:54 AM

రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొరిగుడ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగ యువతిపై లైంగికదాడి, హత్యయత్నానికి పాల్పడిన నిందితుడికి జిల్లా సెషన్స్‌కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అలాగే బాధితురాలికి నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. 2024 అక్టోబర్‌ 31వ తేదీన నిందితుడు బాబులా కులిసిక బాధిత యువతిని బలవంతంగా తన సోదరుడి ఇంటికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడడంతోపాటు హత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై 2024 నవంబర్‌ ఐదో తేదీన బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందిలి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో జిల్లా సెషన్స్‌ కోర్టు 17 మంది సాక్షులను విచారించిన అనంతరం జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి అల్పనా స్వయి ఈ మేరకు తీర్పును వెల్లడించారు.

సునాబేసోలో దేవతామూర్తులు దర్శనం

రాయగడ: రథయాత్రలో భాగంగా స్వామి జగన్నాథుడు, బలభద్ర, శుభద్ర దేవతామూర్తులు శనివారం రథంపై కొలువై సునాబేసోలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం గుండిచా మందిరం నుంచి రథంపై జగన్నాథ మందిరానికి చేరుకున్న దేవతామూర్తులు ఏకాదశి కావడంతో రథంపైనే పూజలందుకున్నారు. స్వామి వారి సునాబేసో దివ్యదర్శనాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

మావో డంప్‌ స్వాధీనం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్‌ ఏరియా జోడాంబు పంచాయతీ ఘనబేఢ గ్రామం అడవిలో శనివారం తెల్లవారుజామున బీఎస్‌ఎఫ్‌, డీవీఎఫ్‌ జవాన్లు ఒక మావో డంప్‌ను గుర్తించి వెలికితీశారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పోలీసు యంత్రాంగం అదేశాలతో శుక్రవారం నుంచే ఘనబేఢ గ్రామానికి ఆనుకొని ఉన్న అడవిలో 177 బెటాలియాన్‌ బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, డీవీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. అయితే శనివారం తిరిగి వస్తున్న సమయంలో తెల్లవారుజామున జవాన్లుకు మావోల డంప్‌ తారసపడడంతో దానిని బయటకు తీశారు. అందులో 3 కిలోల బరువు ఉన్న 3 ఐఈడీలు, 32 జెలిటిన్‌ స్టిక్స్‌, 11 డెటోనేటర్లు, 500 గ్రాముల గన్‌పౌడర్‌, 3 మీటర్లు కోడెక్స్‌ వైరు, 1 రేడియో, 2 టార్చలైట్స్‌, 12 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. మావో కదలికలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

కట్రిగుడలో పులి పాదాల గుర్తులు

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ కోట్‌పాడ్‌ సమితి ఛతర్ల గ్రామ పంచాయతీ కట్రిగుడ గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి పాదాల గుర్తులు ఆ గ్రామ ప్రజలను భయానికి గురి చేస్తున్నాయి. గ్రామ పరిసరాల్లో గత నాలుగు రోజులుగా పులి సంచరిస్తోందని ప్రజలు అనుమానిస్తున్నారు. దీంతో సాయంత్రం కాకముందే ఇళ్ల తలుపులు మూసివేస్తున్నారు. తెల్లవారితే గానీ బయటకు రావడం లేదు. దీంతో కోట్‌పాడ్‌ అటవీ అధికారులకు తెలియజేయగా.. కోట్‌పాడ్‌ అటవీ రేంజ్‌ గోవింద నాయిక్‌ కట్రిగుడ గ్రామం వచ్చి కనిపించిన పాదాలను పరిశీలించారు. అవి పులి అడుగులేనని నిర్ధారించారు. ప్రజలు ఇంటి నుంచి రాత్రులు బయటకు రావద్దని హెచ్చరించారు. అటవీ సిబ్బంది పులి జాడలను తెలుసుకునేందుకు గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పులి పక్కరాష్ట్రం ఛత్తీష్‌ఘడ్‌ కురుంది సమీప అడవి నుంచి వచ్చినట్లు గుర్తించామని రేంజ్‌ అధికారి వెల్లడించారు. ప్రజలకు పులి జాడ తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement