సోంపేట: సోంపేట మేజర్ పంచాయతీలో విద్యుత్ పనుల్లో తాత్కాలిక సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న నాతి ధర్మారావు(33) విద్యుత్ షాక్‌తో బుధవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు ధర్మారావు మేజర్ పంచాయతీ పరిధిలో వీధి దీపాలు వెలిగించడం, ఆపివేయడం తదితర సేవల కోసం తాత్కాలిక పద్ధతిలో గత ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం తన సహోద్యోగి దిలీప్‌కుమార్‌తో కలిసి విధులు నిర్వహిస్తుండగా, తహసీల్దార్ కార్యాలయానికి ఆనుకుని ప్రధాన రహదారి వద్ద ఉన్న స్తంభానికి విద్యుత్ సరఫరా ఉండడం వలన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఎప్పుడూ విద్యుత్ సరఫరా ఉండని స్తంభానికి బుధవారం విద్యుత్ సరఫరా అవ్వడం వలనే ప్రమాదం సంభవించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది, విద్యుత్ శాఖాధికారులకు సమన్వయం లేకపోవడమే ప్రమాదానికి కారణమని వాపోతున్నారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. ధర్మారావు చెల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి.మోహిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధర్మారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీపీ నిమ్మన దాస్ కోరారు.


