పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై పురషోత్తమాసం సందర్భంగా సోమవారం అంగరంగవైభవంగా బుర్‌ఖాత్ పాస్ నుంచి మహేంద్రగిరి పర్వతం వరకూ మహిళలు పెద్ద ఎత్తున కలశ యాత్ర జరిపారు. దాదాపు బుర్‌ఖాత్ పాస్ నుంచి ఆరు కిలో మీటర్లు కాలినడకన కొండపైకి వెళ్లి పవిత్ర మహేంద్ర పర్వతం పై జరుగుతున్న విశ్వయజ్ఞం వద్ద ఉంచారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాలోకానంద, సత్యనారాయణ దాస్, అంతర్యామి గోమాంగో, రాయగడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్ పాల్గొన్నారు. అలాగే విశ్వహిందూపరిషత్ నాయకులు, భజరంగ్‌దళ్ నాయకులు రాయగడ, పర్లాకిమిడి, కొరాపుట్, నయాఘడ్, గంజాం, ఫుల్బణి నుంచి విచ్చేశారు. బుర్‌ఖాత్ పాస్ వద్ద నుంచి మహిళలు పసుపురంగు చీరలు ధరించి పవిత్ర కలశాలను పట్టుకుని నడిచి మహేంద్రగిరికి చేరుకున్నారు. మహిళలు కుంతీ మందిరం వద్ద అభిషేకాలు చేయించారు. ఆదివాసీ సవర సంస్కృతి తలపిస్తూ వారి వాయిద్యాలతో నాట్యాలు చేసి ఆనందోత్సవాలమధ్య విశ్వశాంతి యజ్ఞానికి సహకరించారు. ఈ సందర్భంగా భాస్కరతీర్థ లక్ష్మీబాబా మాట్లాడుతూ, ఈ పురుషోత్తం మాసంలోపవిత్ర మహేంద్రగిరికి వస్తే ప్రతి ఒక్కరికి పుణ్యం కలుగుతోంది. నేటి నుంచి కలశ యాత్ర, హరిహారాత్మక యజ్ఞం, చండీ మహాయజ్ఞం, జ్ఞాణ, ఆర్ణ యజ్ఞం, పూర్య యజ్ఞం వంటివి జరుగుతాయి. అలాగే భాగవతం, రామాయణ మానస చరిత్రను వేదపండితులు పఠిస్తారు. దేశంలోని నలుమూలలనుండి అనే మంది సాధుసంతువులు ఇక్కడకు విచ్చేశారు. వారి ఈ తొమ్మిది రోజుల పాటు పలు యజ్ఞాలను నిర్వహిస్తారు. జూన్ 15 న తిరిగి ఈ సాధుసంతువులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని, అలాగే కలశయాత్రకు 10వేల మంది మహిళలు వస్తారని అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడా జూన్ 2 మంగళవారం మహంద్రగిరిలో జరుగుతున్న మహేంద్రమేళాకి విచ్చేస్తారని పలువురు అధికారులు తెలియజేశారు.


