జయపురం: స్థానిక పూజ్యపూజ్ సంసద్ వారు సోమవారం సాహితీ సభలో ఒడిశా కవిసామ్రాట్ ఉపేంధ్ర భంజ్ కవితలపైన, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు రాధామోహన్ సాహుపై ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు కవిసామ్రాట్ ఉపేంద్ర చిత్రాలను గీశారు. సరస్వతీ శిశుమందిర విద్యార్థులు ఆరాధ్య కౌశిక్, అనితా కౌశిక్‌లు ఉపేంధ్ర భంజ్‌పై రాసిన వ్యాసాలను చదివి వినిపించారు. స్వాతంత్య్ర యోధులు రాధామోహన్ సాహు జీవిత చరిత్రను సరస్వతీ శిశుమందిర విద్యార్థిని సంస్కృతి సామంతరాయ్ చదివి వినిపించి ఆ వ్యాసాన్ని సభకు అందజేశారు. పూజ్య పూజ సంసద్ అద్యక్షులు ఉదయ శంకర జాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథిగా పతంజలి విభాగ అధ్యక్షురాలు జానకీ పాణిగ్రహి ఒడియా సాహిత్యంపై కవి సామ్రాట్ ఉపేంధ్ర భంజ్ ప్రభావం, సమాజాన్ని చైతన్యపరచే ఆయన రచనలపై ప్రసంగించారు. అలాగనే అలాగనే స్వాతంత్య్ర ఉద్యమంలో కొరాపుట్ జిల్లా భూమిక స్వాతంత్య్ర యోధులలో రాధామోహన్ సాహు పోరాట పటిమలపై ఆమె ప్రసంగించారు.
10 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి పోలీసులు ఆదివారం రాత్రి అక్రమ రవాణాకు సిద్ధం చేసిన భారీ గంజాయిను పట్టుకున్నారు. చిత్రకొండ సమితి గుంఠబేఢ పంచాయతీ ఆరంగి గ్రామ అడవిలో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు గంజాయిని నిల్వ ఉంచారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం అందడంతో ఐఐసీ జయనారాయణ్ ఖండేయ్ తన సిబ్బందితో ఆదివారం రాత్రి దాడి చేయగా పోలీసుల రాకను తెలుసుకున్న మాఫియా సభ్యులు పరారయ్యారు. అక్కడ ఉన్న గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. సోమవారం గంజాయిను తూకం వేయగా 10 క్వింటాళ్లు ఉంది. దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
విద్యుత్ వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు జారీ
భువనేశ్వర్: ప్రభుత్వ కార్యకలాపాల్లో వినియోగించే విద్యుత్ వాహనాల (ఈవీల) కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. పశ్చిమ ఆసియాలో తాండవిస్తున్న సంక్లిష్ట పరిస్థితుల దష్ట్యా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు అవుతాయి. తాజా నిబంధనల ప్రకారం ఒక అధికారి ఒక వాహనం ప్రాతిపదికన గవర్నర్, ముఖ్యమంత్రి, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు రూ. 30 లక్షల వరకు విలువైన ఈవీలను కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్, శాఖా కార్యదర్శులు రూ. 25 లక్షల వరకు ఖరీదు చేసే ఈవీలకు అర్హులు కాగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు, కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు రూ. 20 లక్షల వరకు విలువైన టాటా, మహీంద్రా, మారుతీ కంపెనీల ఉత్పాదిత ఈవీలను కొనుగోలు చేయవచ్చు. వాహనాల కొనుగోలుకు ఆర్థిక శాఖ ఆమోదం అవసరం. ప్రస్తుతం ఉన్న అధికారిక వాహనం నిర్దేశిత సేవా కాలాన్ని పూర్తి చేసు కున్న తర్వాతే ఈ కొనుగోలుకు అనుమతిస్తారు.
మహేంద్రగిరి, కోయిపూర్ వద్ద కుండపోత
పర్లాకిమిడి: మహేంద్రగిరిలో విశ్వశాంతి యజ్ఞం సందర్భంగా పవిత్ర కలశాలు యజ్ఞం వద్ద ఉంచిన తర్వాత మహేంద్ర నుండి కోయిపూర్ వరకూ గంటన్నర సేపు కుండపోత వర్షం కురిసింది. దీంతో మహంద్ర పర్వతానికి వెళ్లిన భక్తులు తడిసి ముద్దయ్యారు. దీంతో పలువురు మహిళలు తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడ్డారు.


