జయపురం: జయపురంలో నిషా ఇంజెక్షన్ల వ్యాపారానికి పోలీసులు చెక్ పెట్టారు. నిషా ఇంజెక్షన్లు తీసుకు వచ్చి జయపురం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.40 వేల విలువ చేసే 750 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ తెలిపారు. వ్యాపారానికి వినియోగించే కారుతో పాటు రూ.15 వేలు నగదు, 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. అరెస్టన నిందితులు జయపురం సౌరాసాహి దేబాసిస్ పట్నాయిక్(29), స్థానిక పారాబెడ వాసి తాపస సాహు(29), జయపురం డొంగాగుడ వాసి రామ హరిజన్(34), క్రిష్టియన్ పేట నివాసి ప్రదీప్ ఖోర ఉరఫ్ రోణి(25) స్థానిక పూర్ణగడ్ నివాసి సూరజ కుమార్ గుప్త ఉరఫ్ సోను(29)లు అని వెల్లడించారు. వీరిలో రామ హరిజన్, సూరజ కుమార్ లను గత ఏడాది పట్టణ పోలీసు అధికారులు నిషా ఇంజెక్షన్ల వ్యవహారంలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
గత అర్ధరాత్రి గాంధీ చౌక్ నుంచి గొడొపొదర్ కెనాల్ రోడ్డు లో సంధ్యా ఫంక్షన్ హాల్ సమీపంలో కొంత మందితో నిషా ఇంజెక్షన్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం అందడంతో పట్టణ పోలీసులు వెంటనే వెళ్లి దాడి జరిపారు. అక్కడ ఆరుగురు ఉండగా ఒకడు పారిపోయాడు. ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఇంజెక్షన్లను డాక్టర్లు మత్తు ఇచ్చే క్రమంలో వినియోగిస్తారు.


