భువనేశ్వర్: స్థానిక ఖండగిరి సమీపం జగమొర ప్రాంతంలో అంబులెన్స్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉదయం 4.30 గంటలకు కటక్ ప్రాంతానికి రోగిని తరలించి తిరిగి వచ్చి పార్క్ చేసి ఉండగా ఉదయం 6 గంటల ప్రాంతంలో అందులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. అదృష్టవశాత్తూ అప్పటికే డ్రైవర్‌తో పాటు సహాయకుడు వాహనం నుంచి దిగి వారి గదులలో విశ్రాంతి తీసుకుంటుండటంతో ఎలాంటి గాయాలు లేదా ప్రాణ నష్టం జరగలేదు. నగర పాలక సంస్థ (బీఎంసీ) పారిశుద్ధ్య కార్మికుడు వాహనాన్ని చుట్టుముడుతున్న మంటలను గమనించి స్థానికులు, అగ్ని మాపక విభాగాన్ని అప్రమత్తం చేశాడు. అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను ఆర్పి వేసే సమయానికి అంబులెన్స్ తీవ్రంగా దెబ్బతిని చాలా భాగం కాలిపోయింది. ఇంజిన్ బేలో సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు.


