నగరంలో పెరిగిన ఇంధన ధరలు | - | Sakshi
Sakshi News home page

నగరంలో పెరిగిన ఇంధన ధరలు

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

భువనేశ్వర్‌: సోమవారం నుంచి తాజా ఇంధన ధరల సవరణలు అమల్లోకి రావడంతో భువనేశ్వర్‌లో పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు పెరిగాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగో సారి కావడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో డీజిల్‌ ధర ఇప్పుడు లీటరుకు రూ. 100.81 కాగా పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 109.16కు పెరిగింది. సోమవారం నాటి సవరణకు ముందు భువనేశ్వర్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 106.33గా, డీజిల్‌ ధర లీటరుకు రూ.97.92గా ఉండేది. స్పీడ్‌ పెట్రోల్‌ వంటి ప్రీమియం వేరియంట్‌ ధర కూడా భారీగా పెరిగాయి. నగరంలో దీని ధర ఇప్పుడు లీటరుకు రూ. 118.27గా ఉంది.

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సంతోష్‌ మిశ్ర

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ బార్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షుడిగా సంతోష్‌ మిశ్ర గెలిపొందారు. సమీప ప్రత్యర్థి సిరాజుద్దీన్‌ అహ్మద్‌పై 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ఏకగ్రీవం సాధ్యం కాకపోవడంతో ఎన్నిక అనివార్యం అయింది. న్యాయవాదులతో కూడిన ఎన్నికల సంఘం పోలింగ్‌ నిర్వహించింది.

వైభవంగా నీలమ్మ సంబరాలు

పర్లాకిమిడి: స్థానిక ఎనిమిదో వార్డు పిన్నింటి పాపన్న వీధిలో గ్రామదేవత నీలమ్మ సంబరాలు రెండురోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ఆరోగ్య వీధిలో ఉంచి, ఘటాలను సోమవారం ఊరేగించారు. మూడు రోజులపాటు జరిగే అమ్మవారి సంబరాలకు విద్యుత్‌ దీపాలను అలంకరించారు.

రూ.40 వేల ఆర్థికసాయం

రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌లో సోమవారం జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కలక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి ఇద్దరు వ్యక్తులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. వివిధ ప్రాంతాల నుంచి 15 వినతులు అందాయి. 7 వ్యక్తిగతమైనవి, మిగిలనవి గ్రామ సమస్యలుగా గుర్తించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వినతుల స్వీకరణ కార్యక్రమంలో గుణుపూర్‌ సబ్‌ కలెక్టర్‌ దుదూల్‌ అభిషేక్‌ అనీల్‌, జిల్లా ముఖ్యవైధ్యాధికారి, చంద్రపూర్‌ బీడీఓ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అగ్నివీర్‌పై ఎన్‌సీసీ క్యాడెట్లకు అవగాహన

జయపురం: అగ్నివీర్‌పై ఎన్‌సీసీ క్యాడెట్లు అవగాహన పెంచుకోవాలని ఆర్మీ అధికారులు అన్నారు. ఎన్‌సీసీ 15వ ఒడిశా బెటాలియన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏటీసీ క్యాంప్‌లో భాగంగా సోమవారం విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌పై అవగాహన కల్పించారు. అగ్ని రిక్రూట్‌మెంట్‌ గోపాలపూర్‌ కార్యాలయ అధికారులు హాజరయ్యారు. అగ్నివీర్‌ లక్ష్యం, అర్హతలు, ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ, శారీరక, రాత పరీక్షలు, అభ్యుర్ధుల ఎంపిక ప్రక్రియలపై వివరించారు. అగ్నివీర్‌లో చేరిన యువతకు దేశ సేవ చేసే అవకాశంతో పాటు వారి ఉజ్వల భవిత నిర్మించుకునే అవకాశం ఉంటుందన్నారు. అగ్నివీర్‌లో చేరాలనుకునే ఎన్‌సీసీ క్యాడెట్లు క్రమం తప్పకుండా సాధన చేయాలన్నారు. క్యాడెట్స్‌ అడిగిన ప్రశ్నలకు ఆర్మీ అధికారులు విపులంగా వివరించారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

గార: మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో విజిలెన్సు, వ్యవసాయాధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. తూలుగు జంక్షన్‌లోని శ్రీశివపార్వతి ఎంటర్‌ప్రైజెస్‌, శ్రీ వేంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ దుకాణాలను విజిలెన్సు ఎస్‌ఐ బి.రామారావు, ఏవో డి.పద్మావతిలు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం ఇటీవల నిషేధించిన పారాక్వాట్‌ కలుపు మందు 287 లీటర్లు ఉండడంతో వాటి అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో ఏఈవోలు బి.దుర్గాప్రసాద్‌, జె.శ్రీదీప్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement