మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల మహిళా కళాశాలలో ఇంటర్ సెకండియర్ ఆర్ట్స్ పరీక్షలు రాసిన సుప్రభా పాత్రో (17)లు ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో తను అనుకున్న మార్కులు రాక పోవడంతో మనస్తాపానికి గురైంది. దీంతో ఆ యువతి శుక్రవారం రాత్రి తన గదిలో టవల్‌తో ఉరి వేసుకుంది. తల్లి చూసి తండ్రిని పిలవడంతో వారు బాలికను కిందకు దించి బలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న బలిమెల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని బలిమెల ఐఐసీ దీరాన్ పట్నాయిక్ తెలిపారు.
వడదెబ్బతో
అటవీ శాఖ గార్డు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా గోవిందపల్లి ఘాట్ రోడ్డులో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న అటవీ శాఖ గార్డ్ గౌరంగ పూజారి(35) శనివారం వడదెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి గార్డులు ఆయనను మత్తిలి సమితి ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మల్కన్‌గిరి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. గౌరంగకు భార్యపిల్లలు ఉన్నారు.
రాజ్యారాణి ఎక్స్‌ప్రెస్‌లో నిలువు దోపిడీ
రాయగడ: బరంపురం నుంచి గుణుపూర్‌కు రాజ్యారాణి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి మత్తు పదార్థాలు ఇచ్చి అతని వద్ద గల బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్న ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని జిల్లాలోని గుణుపూర్‌లో గల నీలాద్రీనగర్ నాల్గో లైన్‌లో నివాసం ఉంటున్న నారాయణ దాస్‌గా గుర్తించారు. ఈ మేరకు రైల్వే పోలీసులకు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... నారాయణ దాస్ తన సొంత పనిమీద బుధవారం బరంపురం వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని శుక్రవారం నాడు 11 గంటల ప్రాంతంలో బరంపురం నుంచి గుణుపూర్‌కు వెళ్లే రాజ్యారాణి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. అతను కూర్చున్న భోగీ సమీపంలొ కొంత మంది తోటి ప్రయాణికుల్లా వ్యవహరించి అతనిని నమ్మించి తమ వెంట తీసుకువచ్చిన మత్తు పదార్థాలను తినే వస్తువుల్లొ కలిపి ఇచ్చారు. నిద్రలోకి జారుకున్న అనంతరం నారాయణ దాస్ ఒంటి మీద ఉన్న బంగారు గొలుసు, ఒక ఉంగరం, కొంత మొత్తం నగదుతో పాటు మొబైల్ ఫోన్‌ను దుండగులు దోచుకున్నారు. అయితే తాను బరంపురం నుండి ట్రైన్‌లో తిరిగి వస్తున్నానని గుణుపూర్ చేరేసరికి మధ్యాహ్నం 2 గంటలవుతుందని తన సోదరుడు ధృవచరణ్ దాస్ కు సమాచారం అందించాడు. సరిగ్గా గుణుపూర్ రైల్వే స్టేషన్ కు ట్రైన్ 2 గంటలకు చేరుకున్నప్పటికీ తన అన్నయ్య ఇంకా ట్రైన్ నుంచి దిగకపోవడంతో ఆయన కంపార్ట్‌మెంట్లు అన్నీ వెతికారు. అనంతరం అచేతన స్థితిలో పడి ఉన్న తన అన్నను గుణుపూర్ ఆస్పత్రికి తరలించారు.అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసిజీ మెడికల్‌కు తరలించారు. జరిగిన ఘటనకు సంబంధించి సొదరుడు ధృవచరణ్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ బాలిక ఛాయారాణి బిశాయి జాతీయ స్థాయి అందాల పోటీలో ప్రథమ స్థానం పొంది కొట్‌పాడ్‌కు గౌరవం తెచ్చింది. జమ్‌షెడ్‌పూర్‌లో ఎంబీ ప్రతిష్టాన్ ద్వారా నిర్వహించిన అందాల పోటీల్లో ఛాయారాణి బిశాయి పాల్గొని ‘బ్యూటీఫుల్ స్టైల్’ బహుమతి పొందింది. అలాగే ‘మిస్ ఇండియ’ పోటీలలో రన్నరప్ స్థానం పొందింది. ప్రస్తుతం ఛాయారాణి ఒక నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. ఆమెకు అనేక మంది ప్రశంసలతో అభినందిస్తున్నారు.


