న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026
సమాజ సేవ..
● రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటి
భువనేశ్వర్:
సమాజానికి ఏ రూపంలో సేవ చేసినా అది అంతిమంగా తనకు తాను చేసుకునే సేవగా మిగులుతుందని.. మానవత్వానికి అదే స్వచ్ఛమైన నిదర్శనమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. గురువారం స్థానిక లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్‌లో జరిగిన ఒడిశా రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాజ్య పురస్కార్ ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు యువత ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాజ్య పురస్కార్ కేవలం ఒక అవార్డు మాత్రమే కాదని.. వ్యక్తిత్వం, పట్టుదల, సమాజం, దేశం పట్ల నిబద్ధతకు ప్రతీక అన్నారు. ఈ గౌరవం కరుణ, జట్టు స్ఫూర్తి, బాధ్యత, దేశభక్తి వంటి విలువలను ప్రతిబింబిస్తుందన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు, జీవిత నైపుణ్యాలు, పర్యావరణ అవగాహన, విపత్తు నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించడంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం గణనీయమైన పాత్ర పోషిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 75 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరిలో ఒడిశాలో నాలుగు లక్షలకు పైగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నారని తెలిపారు. పరిశుభ్రత, మొక్కల పెంపకం, ఆరోగ్య అవగాహన ప్రచారాలు, బహిరంగ కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితులలో సహాయం అందించడంలో వారి సహకారాన్ని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్, ఒడిశా రాష్ట్ర ప్రధాన కమిషనర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ ఉపాధ్యక్షుడు కాళీ ప్రసాద్ మిశ్రా ప్రసంగించారు.


