వాహనం ఢీకొని చిరుత పులికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని చిరుత పులికి గాయాలు

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి ఎంవీ 11 గ్రామం వద్ద వంతెన సమీపంలో బుధవారం రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులికి గాయాలయ్యాయి. చిరుతను అటుగా వచ్చిన కొందరు వ్యక్తులు చూసి అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో మల్కన్‌గిరి రేంజర్‌ రమేష్‌ కుమార్‌ రౌత్‌ ఆదేశాలతో ఆర్‌ఆర్‌టీ బృందం సంఘటన స్థలానికి చేరుకుని చిరుతను స్వాధీనం చేసుకున్నారు. గురువారం వైద్య సేవలు అందించగా కాళ్లు రెండు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలానే కొంతమంది దానిపై దాడి చెయ్యడంతో కంటికి కూడా గాయమైంది. ప్రాథమిక వైద్యం తర్వాత గురువారం సాయంత్రానికి నవరంగ్‌పూర్‌లో రెస్క్యూ సెంటర్‌కు పంపించారు. అక్కడ కోలుకున్నాక తిరిగి తెచ్చి అడవిలో విడిచిపెతామని తెలిపారు.

రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి

పర్లాకిమిడి: దివంగత ప్రధాని, రాజీవ్‌ గాంధీ 35వ వర్ధంతి సభను స్థానిక సోండివీధిలో కాంగ్రెస్‌ పార్టీ భవనంలో కాంగ్రెస్‌ శ్రేణులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి అంజలి ఘటించారు. అనంతరం రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలను పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు బసంత పండా వివరించారు. ఈ సభలో సూర్యనారాయణ పాత్రో, రజ పాత్రో, నిరాకర పాణిగ్రాహి, సంగ్రాం సాహు, మున్నా మహారాణా, ఈశ్వర చంద్ర మఝి, మాజీ కౌన్సిలరు అభిమన్యుపండా తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన

పర్లాకిమిడి: గుసాని సమితి ఎంఎస్‌ పూర్‌లో నిర్మించదలచిన ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ బట్టిసిరిపురం గ్రామస్తులు గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన జరిపారు. బట్టిసిరిపురం వద్ద ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మిస్తే 12 గ్రామాలకు మేలు జరుగుతుందని, అదే ఎంఎస్‌ పూర్‌ లో నిర్మిస్తే కొద్ది మంది ప్రజలకే ఉపయోగపడుతుందని బట్టిసిరిపురం గ్రామస్తుడు ఎల్‌.రామకృష్ణ అన్నారు. బట్టిసిరి పురం గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌కు వినతిని అందజేశారు.

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి

రాయగడ: షో రూమ్‌ నుంచి ఖరీదు చేసిన ట్రాక్టర్‌ను ట్రయల్‌ డ్రైవ్‌ చేస్తున్న సమయంలో అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌ మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చందిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మునిసింగ్‌ కూడలిలో బుధవారం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జేకేపూర్‌లో గల షోనాలి షోరూమ్‌లో టెస్ట్‌ డ్రైవ్‌ కోసం ట్రాక్టర్‌ను తీసుకుని వెళ్లి అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. ట్రాక్టరు బోల్తా పడిపోవడంతో ట్రాక్టరు కింద డ్రైవరు చిక్కుకుని తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement