పీహెచ్‌సీకి డాక్టర్‌ను నియమించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీకి డాక్టర్‌ను నియమించాలని ఆందోళన

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

పర్లాకిమిడి: గుసాని సమితి గారబంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గత కొన్నేళ్లుగా డాక్టర్లు లేక మూతబడడంతో ప్రజలు కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌కు వినతిని అందజేశారు. అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో రోగి గారబంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చినా చికిత్స లభించలేదు. దీంతో స్థానికులు కోపోద్రిక్తులై గారబంద గ్రామంలో షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసి గురువారం ఉదయం నుంచి రస్తారోకో చేపట్టారు. దీంతో బరంపురం నుంచి వచ్చే ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు, గొప్పిలి (ఆంధ్రప్రదేశ్‌) నుంచి పర్లాకిమిడి వెళ్లే బస్సులు గారబంద వద్ద నిలిచిపోయాయి. దీంతో ఆందోళన చేపడుతున్న ప్రజల వద్దకు సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి మాధవానంద నాయక్‌, తహసీల్దార్‌ నారాయణ బెహరా,

జిల్లా ప్రజాస్వస్థ అధికారి ప్రసన్నకుమార్‌ నాయక్‌, అదనపు పీహెచ్‌వో డా.రబినారాయణ దాస్‌ తదితరులు విచ్చేసి మాట్లాడారు. గారబంద పీహెచ్‌సీకి డాక్టర్‌, ఫార్మసిస్టు, అంబులెన్స్‌ వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే పీహెచ్‌సీ నుంచి సీహెచ్‌సీగా మార్చాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. గారబంద పీహెచ్‌సీకి తాత్కాలికంగా గురండి సీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అక్షయనాయక్‌ వారానికి నాలుగు రోజులు పనిచేయాల్సిందిగా సీడీఎంవో డా.సంతును పాఢి తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. అలాగే అంబులెన్స్‌, సీహెచ్‌సీగా మార్పునకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని సబ్‌ కలెక్టర్‌ తెలిపారు. దీంతో సంతృప్తి చెందిన అందోళనకారులు మధ్యాహ్నం 12 గంటలకు ఆందోళనను విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement