భువనేశ్వర్: నగరం శివార్లు పటియా కొలారొహంగొ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు తొలగించారు. వాటిలో ఇళ్లు, దుకాణాలు ఇతరేతర కట్టడాలు ఉన్నాయి. పటియా కొలారోహంగొ ప్రాంతం ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను కూల్చివేసేందుకు తొలి ప్రయత్నంగా పేర్కొన్నారు. భువనేశ్వర్ నగర పాలక సంస్థ (బీఎంసీ), భువనేశ్వర్ అభివృద్ధి సంస్థ (బీడీఏ) రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పాలన విభాగాలు సంయుక్త కృషితో కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. 50కి పైగా దుకాణాలు, ఇండ్లు అక్రమంగా వెలిసినట్లు బీడీఏ గుర్తించింది. వాటిని తొలగించేందుకు బీఎంసీ సిబ్బందిని నియమించింది.
కలప దుంగలు స్వాధీనం
రాయగడ: జిల్లాలోని గుడారి అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో నయిరా సమీపంలోని కొటాలిబీట్ అడవుల్లో ఉన్న 45 కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు కలప రవాణా మాఫియా ముందుగా చెట్లను నరికి వాటని అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అదే వైపు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అవి ఒకపక్కన ఎవ్వరికీ కనిపించకుండా దాచి పెట్టినట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు.
వ్యక్తి ఆత్మహత్య
మల్కన్‌గిరి: జిల్లాలో కలిమెల సమితి కేంద్రంలోని హట్‌పోడ వీధిలో నివసిస్తున్న సపన్ పాల్ (55) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన ఉన్న చిన్న పాకలో ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన కలిమెల పట్టణంలో పకోడి దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియని గానీ మంగళవారం ఉదయానికి ఆత్మహత్య చేసుకున్నాడు. కలిమెల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిండు గర్భిణి
అనుమానాస్పద మృతి
రాయగడ: నిండు గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సికరపాయి పంచాయతీ పరిధి బెలకొన గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలు రంజిత నెమలపూరి (26)గా గుర్తించారు. అయితే తన కూతురుది హత్యేనంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రంజితకు రెండేళ్ల క్రితం బెల్‌కొన గ్రామానికి చెందిన పంకజ్ నెమలపూరితో వివాహమయ్యింది. అయితే ఆమె ఆరోగ్యం బాగోలేదని భర్త సోమవారం హాస్పిటల్‌కు తరలించాడు. ఆస్పత్రిలో చికిత్సావస్థలో ఆమె మృతి చెందింది. విషయం తెలియడంతో అక్కడికి చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెది హత్య అని ఆరోపించారు. అత్తింటి వేధింపులతోనే చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.


