● పథకం ప్రకారమే హత్య: ఎస్పీ
రాయగడ: స్థానిక రెల్లివీధికి చెందిన హడప నిఖిల్ (17) అనే యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రత్యేక మాన్ హంట్‌లో 9 మంది నిందితులను అరెస్టు చేశామని మరో 12 మందిని అరెస్టు చేసే ప్రక్రియలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ తెలియజేశారు. ఆదివారం స్థానిక డీపీఓ కార్యాలయం సమావేశంలో హత్య కేసుకు సంబంధించి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు స్థానిక రైతుల కాలనీకి చెందిన 8 వ లైన్‌లో నివసిస్తున్న ఉమేష్ చంద్ర హియల్, దొరాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలొని కంపర గ్రామానికి చెందిన విల్సన్ సిమిలి అలాయాస్ రాజ్ సిమిలి, స్థానిక స్వీపర్ కాలనీలో నివాసముంటున్న అక్షయ సామల్ అలియాస్ టింకులు, తుంబిగుడ ప్రాంతానికి చెందిన రాజా హుయిక, కళాశాల సమీపంలో గల ఎస్‌ఆర్ టవర్ ప్రాంతానికి చెందిన సుమిత్ జైన్, దొభివీధికి చెందిన వై.శ్యామసుందర్, కొంధొపిట్ల వీధికి చెందిన వి.లొకేష్ కుమార్, హౌసింగ్ బొర్డుకు చెందిన బి.పవన్‌కుమార్, సాయిప్రియ నగర్ కు చెందిన ఎస్.ప్రేమ్ కుమార్ లు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఉమేష్, విల్సన్, అక్షయ్‌లను బీహార్ రాష్ట్రంలో గల ఔరంగబాద్‌లో అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. అరెస్టయిన నిందితుల నుంచి స్కార్పియో, మహేంద్ర బొలేరొ వాహనాలతొ పాటు ఒక తుపాకీ, 11 మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
పథకం ప్రకారమే హత్య
మే తొమ్మిదో తేదీ ఉదయం స్థానికంగా గల ఒక హోటల్‌లో నిందితులు సమావేశమయ్యారు. ఎలా హత్య చేయాలని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ప్రధాన నిందితుడు ఉమేష్ వ్యూహత్మకంగా అందరికి తెలియజేశాడు. పథకం అనుకున్న పథకం ప్రకారం తొమ్మిదో తేదీ రాత్రి సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో స్థానిక ఇందిరా నగర్ మూడు లైన్‌లో ఏదొ పనిమీద ఉన్న నిఖిల్ హడపను నిందితులు గుర్తించారు. అనంతరం అతనిని హత్య చేసేందుకు వెంబడించారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల ను నిఖిల్ పై కాల్పులు జరిపారు. అయితే అప్పటికే తనను వెంటాడుతున్నాడన్న విషయం తెలుసుకున్న నిఖిల్ వారి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇందిరా నగర్‌లో ఒకరి ఇంటిలోకి వెళ్లాడు. అప్పటికే నిందితులు అది గమనించి నిఖిల్ ను పట్టుకుని తమ వెంట తీసుకువచ్చిన బొలేరొలొ తీసుకువెళ్లారు. మరుసటి రొజు స్థానిక నాగావళి నది వద్ద నిఖిల్ మృతదేహం గుర్తించారు. అయితే నిందితులు నిఖిల్‌ను తుపాకీ సహాయంతొ హత్య చేశారని, మృతదేహం నుండి రెండు తుపాకీ గుళ్లను గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు.
పాత వైరమే హత్యకు దారి తీసింది
నిఖిల్ హత్య కు పాత కక్షలే కారణమని పోలీసులు వెల్లడించారు. కొరాపుట్ జిల్లా అలమండ ప్రాంతంలో జరిగిన జూదం కేసుకు సంబంధించి విభేదాలే ఈ హత్యకు కారణంగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వాతి మాట్లాడుతూ ఐపీఎస్ ప్రత్యక్ష పర్యవేక్షనలొ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు ఎస్పీ రామేంద్ర ప్రసాద్ సాంకేతిక నిఘా, అదనపు ఎస్పీ మనోజ్ పూజారి మానవ నిఘా విభాగాల సహాయంతొ రాష్ట్రంలొని పలు ప్రాంతాలతొ పాటు ఇతర రాష్ట్రాల్లొ ఈ బృందాలు మోహరించి నిందితుల కొసం గాలింపు చేపట్టామని ఎస్పీ వివరించారు. ఇదిలాఉండగా నిందితులకు సహకరించిన వారిపై కూడా చర్యలు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను ఆశ్రయించడం, డబ్బులు పంపడం, ఆధారాలు ధ్వంసం చేయడం వంటి ఆంశాలపై విచారణ కొనసాగుతుందని త్వరలో హత్య కేసులో ఉన్న మిగతా వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ మనొజ్ పూజారి, ఏఎస్పీ రామేంద్ర కుమార్, ఎస్‌డీపీఓ గౌరహరి సాహు, సదరు పోలీస్ స్టేషన్ ఐఐసి ప్రశన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.


