వెంటాడుతున్న ఇంధన కొరత! | - | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న ఇంధన కొరత!

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

జయపురం: రాష్ట్రంలో పెట్రోలు, డీజల్‌కు కొరత లేదని అధికారులు చెబుతున్నారు. అయితే పరిస్థితి మాత్రం అందుకుభిన్నంగా ఉంది. ఏ పెట్రోలు పంపు వద్ద చూసిన వాహనదారులు బారులుదీరుతున్నారు. దీనిపై జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి ప్రజలు మండిపడుతున్నారు. అనేక పెట్రోలు బంక్‌లలో ఇంధనం లభించటం లేదని, పలుచోట్ల నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. బొరిగుమ్మ పెట్రోలు బంక్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆయిల్‌ కోసం వెళ్తున్న వాహనదారులు, డ్రైవర్లు ఆయిల్‌ లభించక నిరాశతో బంకుల నుంచి వెనుదిరుగుతున్నారు. అయితే బంకుల్లో లభించని పెట్రోలు, డీజిల్‌ బయట మార్కెట్‌లో అధిక ధరకు లభిస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సివిల్‌ సప్‌లై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టిసారించి పరిస్థితిని చక్కదిద్దాలని వినియోదారులు కోరుతున్నారు.

పోలీస్‌–మేజిస్ట్రేట్‌ సంయుక్త

సమన్వయ సమావేశం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావాలని కలెక్టర్‌ ప్రథమేశ్‌ అర్వింద్‌ పిలుపునిచ్చారు. శాంతిభద్రతలు అదుపు చేయడానికి ఎస్పీ వినోద్‌ పటేల్‌ శనివారం పోలీసు–మేజిస్ట్రేట్‌ సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అంతర్గత భద్రతపై చర్చించారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ భూముల సర్వే సమయంలో తహసీల్దార్‌కు పూర్తిస్థాయి బలగాలు అందించాలన్నారు.

బాలల అక్రమ రవాణా

భువనేశ్వర్‌: రైల్వే పోలీసులు బాలాసోర్‌ జిల్లా సొరొ రైల్వే స్టేషన్‌లో బాలల అక్రమ రవాణా కలకలం రేపుతోంది. అంగుల్‌ వెళ్లే రైలు కోసం సొరో స్టేషన్‌లో గుమి గూడి వేచి ఉన్న బాలల్ని ప్రశ్నించిన రైల్వే పోలీసులు వీరి రవాణా పట్ల అనుమానం వ్యక్తం చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా విధులు నిర్వహిస్తుండగా అనుమానంతో రైల్వే పోలీసులు బాలల్ని ప్రశ్నించారు. మతపరమైన ప్రసంగాలు, ప్రార్థనలు వినడానికి ఒక సమావేశానికి తమను తీసుకువెళ్తున్నారని పిల్లలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 27 మంది బాలలను సంరక్షించి బాలాసోర్‌ చైల్డ్‌ లైన్‌కు అప్పగించారు. వారిలో 9 నుంచి 15 ఏళ్ల వయస్సు గల 19 మంది బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. వీరంతా మయూర్‌భంజ్‌ జిల్లా కప్తీపడా పోలీస్‌ ఠాణా పరిధిలోని తులుగడియా, ఔపొడా, మరియు ఢెంకనాల్‌ సహా వివిధ ప్రాంతాలకు చెందినవారు. మూడు రోజుల మతపరమైన సమావేశంలో పాల్గొనేందుకు వారిని అంగుల్‌కు తీసుకువెళ్తున్నట్లు ప్రాథమిక సమాచారం. వారిని తీసుకు వస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement