పూరీ–కొరాపుట్ రైలును..
జయపురం: కేంద్ర ప్రభుత్వం శ్రీక్షేత్రం పూరీ నుంచి శబరిశ్రీ క్షేత్రం కొరాపుట్ వరకు రైలును నడిపేందుకు నిర్ణయించిన విషయం విదితమే. అందుకు హర్షం వ్యక్తం చేసిన జయపురం సబ్‌డివిజన్ ప్రజలు పూరీ నుంచి కొరాపుట్ వరకే కాకుండా అవిభక్త కొరాపుట్‌లో ప్రధాన పట్టణం జయపురం వరకు ఆ రైలు నడపాలని పట్టణ ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ విభాగానికి పలు సంస్థలు ప్రముఖులు లేఖలు రాశారు. తమ డిమాండ్‌ను పరిగణలోనికి తీసుకొని జయపురం వరకు పూరీ–కొరాపుట్ రైలు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఉత్తర ఒడిశాతో కొరాపుట్– జయపురంను రైలు అనుసంధానం కోసం ఒడిశా ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూరీ– కొరాపుట్ రైలు కేవలం కొరాపుట్ వరకే నడుస్తుందని, దానిని జయపురం వరకు పొడిగిస్తే జయపురం సబ్‌డివిజన్, మల్కనగిరి, నవరంగపూర్ జిల్లాల ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జయపురం పట్టణం పర్యాటక, వ్యాపార, వాణిజ్య రంగాలకు కేంద్రంగా ఉండటం వలన అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారన్నారు. వైద్య, విద్యా, తదితర పనులపై నవరంగపూర్, మల్కన్‌గిరి జిల్లాల నుంచి అనేక మంది ప్రజలు వస్తుంటారన్నారు. నవరంగపూర్, మల్కన్‌గిరి ప్రజలు రైలు ప్రయాణం కోసం జయపురంపైనే ఆధారపడుతున్నారన్నారు. ఆర్థికంగా వెనకబడి ఉన్న ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఉత్తర ఒడిశా ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణం చౌకగా ఉంటుందన్నారు. కేంద్ర రైల్వే విభాగం వారు జయపురం– మల్కనగిరి, జయపురం నవరంగపూర్ రైలు మార్గాలు ఆమోదించిందని, ఈ రెండు రైలు మార్గాల పనులు చురుగ్గా సాగుతున్నాయని, అందుచేత జయపురం ఒక ప్రధాన రైల్వే జంక్షన్ కాగలదని తెలుపుతూ, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పూరీ– కొరాపుట్ రైలును జయపురం వరకు పొడిగిస్తే కొరాపుట్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందన్నారు.


