రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి నకిటిగుడ గ్రామంలో ఆదిత్యా అలూమిన కర్మాగారం ఆధ్వర్యంలో శుక్రవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అనారోగ్యానికి గురైన పశువులను తీసుకొచ్చి ఇక్కడ చికిత్స చేయించారు. పశు సంపదను కాపాడుకోవడం, అదేవిధంగా వాటికి సకాలంలో వైద్యం అందించడం వలన పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు సూచించారు. పశువులను రోడ్లపై విడిచిపెడుతుండడంతో అవి ప్లాస్టిక్ వంటి పదార్థాలను తిని అనారోగ్యాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల పశువులను పెంచడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను కూడా తీసుకోవాలని వివరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 560 మేకలు, 457 పశువులకు చికిత్స అందించారు. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న పశువులకు సంబంధించి ఉచితంగా వాటి యజమానులకు మందులను పంపిణీ చేశారు.


