రాయగడ: రాష్ట్ర విద్యా, వెనుకబడిన వర్గాల సంక్షేమ, సామాజిక భద్రత శాఖల మంత్రి నిత్యానంద గొండో రాయగడలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్న మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని ఆకాంక్షించారు. విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, ఆరోగ్యం తదితర శాఖల పనితీరుపై సమీక్షించారు. కార్యక్రమంలో ప్రత్యేక అభివృద్ధి మండలి చైర్మన్ విద్యాధర్ సబర్, వైస్ చైర్మన్ మంజుల మినియాక, కలెక్టర్ అశుతోష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
డెంగీపై అవగాహన
రాయగడ: సదరు సమితి పితామహాల్‌లోని సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రాస్పత్రి (డీహెచ్‌హెచ్)లో జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెంగీపై శనివారం అవగాహన కల్పించారు. కలిసి పనిచేద్దాం – డెంగీని దూ రం చేద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సింగ్ అధ్యాపకులు, విద్యార్థులు డెంగీ అవగాహన దూతలుగా పాల్గొని రోగులకు అవగాహన కల్పించారు.
ఎల్‌ఐసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: కటక్ మచ్ఛొకొరొ బజార్‌లో ఉన్న ఎల్‌ఐసీ మండల కార్యాలయంలో శుక్రవారం రాత్రి పూట గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్ తదితర సామగ్రితో పాటు కాగిత పత్రాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది 2 వాహనాల్లో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను నివారించారు.
రైతుల సమస్యలపై
దృష్టి సారించాలి
జయపురం: తమ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్‌ను ఉద్దేశించి వినతిపత్రం సబ్ కలెక్టర్‌కు శుక్రవారం అందజేశారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులందరి పేర్లు నమోదు చేయాలన్నారు. ఆర్‌ఎంసీ, ప్రొక్యూర్‌మెంట్ సంస్థల బాధ్యతలు, విధులను ప్రతీ మండీ వద్ద సమాచార బోర్డుల ద్వారా, లేక పోస్టర్ల ద్వారా డిస్‌ప్లే చేయాలని కోరారు.


