కొరాపుట్: వేసవి రద్దీ నియంత్రించడానికి కేంద్ర రైల్వే శాఖ కొరాపుట్ మీదుగా న్యూఢిల్లీకి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఒక రైలు 08519 నంబర్‌తో ఈనెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు జగదల్‌పూర్‌లో బయల్దేరుతుంది. కొరాపుట్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, ఆగ్రాల మీదుగా హజ్రత్ నిజాముద్దీన్‌కి చేరుతుంది. తిరిగి 25వ తేదీన 08520 నంబర్‌తో తిరుగు ప్రయాణం చేస్తుంది. మరోవైపు 21వ తేదీన విశాఖపట్నంలో ఉదయం 4.15 గంటలకి 08515 నంబర్‌తో బయల్దేరి అరుకు, కొరాపుట్, రాయ్‌పూర్, ఆగ్రాల మీదుగా ఫరిదాబాద్ చేరుతుంది. తిరిగి 25వ తేదీన బయల్దేరి తిరుగు ప్రయాణం చేయనుంది. తొలిసారిగా కొరాపుట్ నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు కావడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
హడప నిఖిల్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు
రాయగడ: స్థానిక ఇందిరానగర్ మూడోలైన్‌లో ఈనెల 9వ తేదీ రాత్రి రెల్లివీధికి చెందిన హడప నిఖిల్ హత్య, కాల్పుల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక బృందానికి అదనపు ఎస్పీ రామేంద్ర ప్రసాద్ నాయకత్వం వహించారు. నిందితులు పలుమార్లు పోలీసులను తప్పించుకుంటూ అరెస్టుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ నిరంతర నిఘా, ప్రత్యేక బృందం కృషితో ప్రధాన నిందితులు ఉమేష్ హియాల్, రాజ్‌సిమ్లీ, అక్షయ్ సామల్ అలియాస్ టింకులను బీహార్ రాష్ట్రంలోని ఔరంగబాద్ జిల్లా మదన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులను అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి ట్రాన్సిట్ రిమాండ్‌పై రాయగడకు తరలిస్తున్నట్లు డీపీవో కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో మరికొంతమంది నిందితులను అరెస్టు చేసేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రస్తుతం వెల్లడించడం సాధ్యం కాదని, పూర్తి సమాచారం అనంతరం తెలియజేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
ఆర్థిక సాయం అందజేత
జయపురం: ఈనెల 11వ తేదీన గుండె జబ్బుతో మరణించిన పైపు మేసీ్త్ర(పంబర్) సన్యాసి దొర కుటుంబానికి పంబర్ వర్కర్స్ యూనియన్ శుక్రవారం ఆర్థిక సాయం చేసింది. పైపు మేసీ్త్ర మృతికి జయపురంలో సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.15 వేలు అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు త్రిలోచన బురుడి, సంఘ సభ్యులు సుదాం హియాల్, కలియ, వికాశ పాత్రో, మంగులు మసాది, త్రినాథ్ నాయిక్ తదితరులు పాల్గొన్నారు.


