కొరాపుట్: ప్రేమ ముందు ఎటువంటి తారతమ్యాలు ఉండవని మరోసారి నిరూపితమైంది. కిన్నెర (హిజ్రా)ని ఒక యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. జగత్సింగ్‌పూర్ జిల్లా టర్టోల్‌కి చెందిన సత్యజిత్ ఆచార్య అనే యవకుడుకి కలహండి జిల్లాకి చెందిన శివాని సాహు అనే కిన్నెరతో ఇన్‌స్ర్ట్రాగాంలో పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరి ప్రేమ కొనసాగుతుండగా ఏడాది క్రితం పూరీలో కలుసుకున్నారు. అయితే వీరి ప్రేమకు మొదట్లో పెద్దలు నిరాకరించారు. కొన్నాళ్లకి వీరి ప్రేమని అర్థం చేసుకొని పెళ్లికి అంగీకరించారు. దీంతో శనివారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణంలో పండితులు వీరిద్దరి గాంధర్వ వివాహం జరిపించారు. ఒకరు పురుషుడు కాగా.. మరొకరు కిన్నెర కావడంతో గాంధర్వ వివాహం చేయాలని పండితులు సూచించారు. ఇరు కుటుంబాల పెద్దలు హాజరై వీరిద్దరిని ఆశీర్వదించారు.
చలివేంద్రం ఏర్పాటు
పర్లాకిమిడి: స్థానిక రాజవీధి ఉమారామలింగేశ్వర ఆలయం (పొడుగు కోవెల) వద్ద లలితా దేవి మందిరం సంఘం ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా బాటసారులకు చల్లని సబ్జా నీటిని లలితా దేవి సంఘం సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో విశాలాక్షి అయ్యర్, మోనింగి రవి, శోభారాణి, పోల్నూరు కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.


