భువనేశ్వర్: జాతీయ ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) కోసం ఈ ఏడాది జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్.ఎస్. గోపాలన్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 29 వరకు ముద్రణ, తయారీ, శిక్షణ పనులు పూర్తి చేసేందుకు కార్యక్రమం ఖరారు చేసినట్లు విలేకర్ల సమావేశంలో తెలిపారు.
ఈ నెల 30 నుంచి జూన్ 28 వరకు బీఎల్‌ఓలు ఇంటింటి పర్యటనలు నిర్వహిస్తారు. జూన్ 28 నాటికి పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేస్తారు. జూలై 5న కాగితపు ఓటర్ల జాబితా ప్రచురితం అవుతుంది. అది మొదలుకొని ఆగస్టు 4 వరకు అభియోగాలు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి గడువు కల్పించారు. సెప్టెంబర్ 2 వరకు వీటిని పరిశీలించి ఓటర్ల తుది జాబితా సెప్టెంబర్ 6న వెల్లడిస్తారు. రాజకీయ పార్టీల ముందస్తు భాగస్వామ్యంతో పూర్తి పారదర్శకతతో ప్రత్యేక ఎన్నికల సవరణను అమలు లక్ష్యంగా సీఈఓ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్లను (బీఎల్‌ఏ) నియమించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు మొత్తం 27,723 మందిని నియమించాయి. ఎస్‌ఐఆర్ తయారీ తొలి దశలో 2002 నాటి ఓటర్ల జాబితాలో 94.61 శాతం 3,16,03,323 మంది ఓటర్లను గుర్తించారు. 45,255 బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లను సందర్శించి లెక్కింపు ఫారాలను పంపిణీ చేసి పూర్తి వివరాలు సేకరిస్తారు. పత్రికా సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్. ఎస్. గోపాలన్, అదనపు సీఈఓ సుశాంత్ కుమార్ మిశ్రా, సంయుక్త సీఈఓ గోపీనాథ్ కువాన్, ఆర్థిక సలహాదారు సంజయ్ కుమార్ లుగున్, డిప్యూటీ సీఈఓ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ సాహు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
రాయగడ: సదరు సమితి కుటిలి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు మీనాపాయి గ్రామానికి చెందిన సునీల్ మినియాక (24)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ద్విచక్ర వాహనంపై మీనాపాయి నుంచి వెళ్తున్న సునీల్‌ను ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన సునీల్ సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో కొరాపుట్–రాయగడ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించారు. నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


