రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి ధమునిపొంగ పంచాయతీ బగాగుడ గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో గ్రామ మహిళలు గురువారం ఆందోళన చేపట్టారు. రహదారి వద్ద ఖాళీ బిందెలను పట్టుకుని నిరసనకు దిగారు. గ్రామంలో 11 కుటుంబాలకు చెందిన 100 మందికిపైగా నివసిస్తున్నారు. ఉన్నవారందరి తాగునీటి సౌకర్యార్థం కేవలం ఒకే గొట్టపు బావి ఉంది. ఉన్న గొట్టపు బావి కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో తాగునీటికి కటకటలాడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణ సింగుపూర్, కలహండి మార్గంలో మహిళలు ఆందోళనకు దిగడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామ పంచాయతీ అధికారి శ్వేతాంబర్ ప్రధాన్ సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. గొట్టపు బావి మరమ్మతులు చేసేంతవరకు తాగునీటి నిమిత్తం ట్యాంక్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.


