మల్కన్‌గిరి: కలిమెల సమితి ఎంవీ 79 పోలీస్‌స్టేషన్ పరిధి ఎంపీవీ 65 గ్రామ శ్మాశనం సమీపంలో కార్తమి దులా(50) అనే వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కార్తమి దులా సొంత గ్రామం మారివషాఢ. అయితే బుధవారం రాత్రి తన పొలంలో పనులు చూసుకొని అక్కడే పడుకుంటానని వెళ్లాడు. గురువారం ఉదయం స్థానికులు అతడి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే గ్రామస్తులు కొందరు పాత కక్షలతో మాల మాడీ హత్య చేసుంటాడని ఆరోపించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నిందితుడిని పూర్తి విచారణ తర్వాత కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
అండర్ 14 సీఎం ఫుట్‌బాల్ ట్రోఫీ విజేత జీబ క్లబ్
పర్లాకిమిడి: గత రెండు రోజులుగా జరుగుతున్న అండర్ 14 సీఎం ఫుట్‌బాల్ ట్రోఫీ 2.0 జిల్లా స్థాయి పోటీలు గురువారం ఉదయంతో ముగిశాయి. మొత్తం బాలురు 6, బాలికల జట్లు 5 పాల్గొన్నారు. వారిలో చివరకు ఫైనల్‌లో జీబ క్లబ్ వెర్సస్ జాజిపూర్ క్లబ్‌లు తలపడగా జీబ క్లబ్ 5 పాయింట్లతో ట్రోఫీని గెలుచుకుంది. జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు జీబ క్లబ్‌కు సీఎం ఫుట్‌బాల్ ట్రోఫీని అందజేశారు. రన్నర్స్‌గా జాజిపూర్ క్లబ్‌కు కప్పును అందజేశారు.
మజ్జిగ వితరణ
రాయగడ: జిల్లాలోని కొత్తపేట కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో రోడ్డుపై వెళ్లే బాటసారులకు కాస్త ఉపశమనం కలిగించేలా సంఘం సభ్యులు మజ్జిగ వితరణ చేపట్టారు. సరాసరి వాహనదారుల వద్దకు వెళ్లి మజ్జిగ అందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కొత్తకోట శ్రీధర్, కార్యదర్శి పెద్దిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
రాయగడ: జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగాధికారులు గురువారం ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో ఇసుకతో వెళ్తున్న 12 ట్రాక్టర్లను పట్టుకున్నారు. తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలుగా విభజించి మల్లిగాం, పితామహాల్, జిమడిపేట ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. పట్టుబడిన వాహనాల్లో నాలుగు ట్రాక్టర్లు రాయగడ తహసీల్దార్ కార్యాలయానికి అధికారులు తరలించగా.. మరో రెండు ట్రాక్టర్లను శేశఖాల్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. రెండు ట్రాక్టర్లకు ఇసుక రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని గుర్తించిన అధికారులు రూ.2,700ల జరిమానా విధించారు. మిగతా పట్టుబడ్డ ట్రాక్టర్లను తనిఖీలు చేసి జరిమానా విధించే ప్రక్రియలో అధికారులు ఓఎంసీ అధికారులకు అప్పగించారు.


