పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై జూన్ 2 నుంచి జరగనున్న మహేంద్రగిరి మేళాను బిశ్వబసు సవర సంస్కృతి సురక్షా మంచ్ వ్యతిరేకిస్తూ బుధవారం మహేంద్రం వద్ద ఆందోళన జరిపారు. దీనిపై గురువారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో మహేంద్రగిరి సవర సంస్కృతి సురక్షా మంచ్ అధ్యక్షులు నిరో భుయ్యాన్, సర్పంచులు, ఇతర ప్రతినిధులుతో సమావేశమయ్యారు. మహేంద్రగరి పర్వతంపై మేళా పేరుతో పర్యావరణం నాశనం చేస్తున్నారని, ఈ మేళాకు బారోఘోరో, మహేంద్రగిరి సురాక్ష మంచ్ ప్రతినిధులను చేర్చలేదని తెలిపారు. సుదీర్ఘంగా గంటసేపు ఆదివాసీ, బిశ్వబజు సవర సంస్కృతి మంచ్ అధినేతలతో కలెక్టరేట్‌లో చర్చలు జరిపినా చర్చలు ఫలప్రదం కాలేదని మంచ్ అధ్యక్షులు నీరో భుయ్యాన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం హాలులో ఆర్.ఉదయగిరి, రామగిరి పోలీసు అధికారులు, జిల్లా పరిషత్ సీడీఓ దయామయ పాఢి ఇతర అధికారులు పాల్గొనగా విలేకరులను అనుమతించ లేదు. దీనిపై కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ సమావేశం అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. బిశ్వబసు సవర సంస్కృతి సురక్షా మంచ్ సభ్యుల డిమాండ్లు అసంబద్ధంగా ఉన్నాయని, వారిని కలుపుకుని మహేంద్రమేళా జరపాలన్న డిమాండ్‌ను స్వాగతిస్తామని అన్నారు. మహేంద్రగిరి పర్యావరణం ముప్పు జరుగకుండా జిల్లా యంత్రాంగం ఎప్పుడూ కృషి చేస్తుందని కలెక్టర్ అన్నారు.


