రాయగడ: దేశవ్యాప్తంగా మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని బీజేడీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అనసూయ మాఝి నేతృత్వంలో స్థానిక గజపతి కూడలి నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2023లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీజేడీ నిస్వార్థంగా మద్దతు తెలిపిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వివిధ కుంటి సాకులు చెబుతూ ఇప్పటివరకు ఆ బిల్లును అమలు చేయలేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ పేరుతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలో మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఒడిశా రాష్ట్రంలో పెరుగుతున్న మహిళలపై దాడులు, వేధింపులు అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక, కార్య నిర్వాహక అధ్యక్షుడు పట్నాన గౌరీ శంకర్, సుధీర్ దాస్, జగదీష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏడీఎం నవీన్ చంద్ర నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.


