భువనేశ్వర్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది. పెట్రోల్ పంపుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. బంకు వర్గాలు పెట్రోలు, డీజిల్ పరిమితంగా విక్రయిస్తున్నారు. అవసరమైనంత పెట్రోల్ లభించడం లేదని ఉభయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ట్యాంకుల్లో పెట్రోల్, డీజిలు అడుగంటిపోయినట్లు సమాచారం. కెంజొహర్, భద్రక్, తెల్కోయ్, బొలంగీర్, జాజ్‌పూర్, భంజనగర్, రూర్కెలా, నీలగిరి, పారాదీప్ ప్రాంతాలలో పెట్రోల్ కొరత ఉంది. ఈ పెట్రోల్ సంక్షోభంపై రాష్ట్ర ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 6, 7 రోజుల్లో స్థానిక బస్సు సేవలు నిలిచిపోతాయని రాష్ట్ర ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం కార్యదర్శి దేవేంద్ర సాహు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజా రవాణాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అభ్యర్థించారు. ప్రజా రవాణాకు కార్డులు ఏర్పాటు చేసి డీజిల్ అందించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 14 వేల ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. పెట్రోల్ లభించకపోవడంతో సుమారు 2000 బస్సు సేవలు నిలిచి పోయాయి. ఇంధనం కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో లేని పరిస్థితి తాండవిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 2,850 పెట్రోల్ అవుట్‌లెట్లలో 20 నుంచి 22 పంపుల వద్ద తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అభయం ఇస్తుంది. 1 శాతం కంటే తక్కువ పెట్రోల్ పంపులలో కొరత ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. కలెక్టర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా సంక్షోభ నిర్వహణ బృందాల ద్వారా సరఫరాను తక్షణమే పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. లీటరుకు రూ. 130 నుంచి 140 వసూలు చేస్తున్న రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు భయాందోళనలతో అవాంఛనీయ ఇంధనం కొనుగోలు చేయవద్దని కోరారు.


