పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొవడానికి ముందస్తుగా సైక్లోన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో షెల్టర్లు, ఆహారం, చెట్లు నరికే యంత్రాలను సిద్ధం చేయాలని బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జరిగిన వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో జరిపిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్, జిల్లా స్థాయి ప్రకృతి వైపరీత్యాల కమిటీ సమావేశానికి ఎంపీ ప్రదీప్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మోహనా, పర్లాకిమిడి ఎమ్మెల్యేలు దాశరథి గోమాంగో, రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ (ఇన్‌చార్జి) సునీల్ కుమార్ మహంతి, డీఎఫ్‌ఓ కె.నాగరాజు, అత్యవసర విభాగం అధికారి నిరోద్ చంద్ర నాయక్ ముఖ్యవక్తలు హాజరయ్యారు. గజపతి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ తుపాన్ షెల్లర్లు ఉన్నాయని, కాశీనగర్ సమితిలోని వరద ప్రాంతంలో 3 షెల్టర్లు ఉన్నాయని అత్యవసర విభాగం అధికారి అన్నారు. వాయుగుండం, తుపాన్ సమయంలో జిల్లాలో విపత్తులు ఎదుర్కొవడానికి పునరావాస కేంద్రాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను అధికారులు గుర్తించాలని ఎంపీ సూచించారు. జిల్లా వ్యాప్తంగా తుపాన్లను ఎదుర్కొవడానికి 1007 ప్రాథమిక పాఠశాలలు, 838 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, 4020 ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని జిల్లా ముఖ్యశిక్షాధికారి మయాధార్ సాహు అన్నారు. జిల్లాలో ప్రకృతి విపత్తులు ఎదుర్కొవడానికి గ్రామీణ రోడ్లు డివిజన్, ప్రజాపనుల శాఖ, అగ్నిమాపక దళం సిబ్బంది అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అన్నారు. పది పబ్లిక్ పరీక్షల్లో గజపతి జిల్లా రెండో సారి పాస్ శాతంలో ప్రథమం రావడంతో డీఈఓకు ఎంపీ అభినందనలు తెలిపారు. గోపాల్‌పూర్– తెరువల్లి రైల్వే మార్గాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం తెలుపడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.


