పర్లాకిమిడి: గజపతి జిల్లా రాష్ట్ర స్థాయిలో వార్షిక మాధ్యమిక బోర్డు పరీక్షల్లో 99.3 శాతం ఉత్తీర్ణత సాధించిందినందుకు జిల్లా విద్యావిభాగం, జిల్లా యంత్రాగం తరఫున విద్యార్థులకు స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హల్‌లో ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, మెమొంటోలు అందజేశారు. గజపతి జిల్లాలో ఉపాధ్యాయులు ‘సూపర్ 30’ మంచి ఫలితాలు ఇచ్చాయని, ఈ విజయం ఇకముందు కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా డీఈఓ మయాధర్ సాహు అన్నారు.
ఈ విజయోత్సవానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, జిల్లా సంక్షేమశాఖ అధికారి సల్మన్ రైక, జిల్లా పరిషత్తు సీడీఓ దయామయ పాడీ, ఎస్.డి.సి చెర్మన్ కామదేవ్ బడనాయక్, తదితరులు పాల్గొన్నారు. ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఏ1గా నిలవగా, మరో ముగ్గురు 90 శాతం మార్కులు సాధించిన వారిని, డీఈఓను ఎంపీ ఘనంగా సన్మానించారు.


