అభివృద్ధికి మూలం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి మూలం

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

విద్యా రంగంలో పెట్టుబడులు..

విద్యా సదస్సులో గవర్నర్‌ హరిబాబు

భువనేశ్వర్‌: నాణ్యమైన విద్య, ఆవిష్కరణలు, నైపుణ్య మానవ వనరుల సాధికారత, విజ్ఞాన ఆధారిత సమాజం ద్వారా మాత్రమే వికసిత్‌ ఒడిశా, వికసిత్‌ భారత్‌ దార్శనికతను సాకారం చేసుకోగలమని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి అన్నారు. విజ్ఞాన ఆవిష్కరణలో అత్యంత కీలక పాత్ర పోషించే విద్యారంగంలో అధిక పెట్టుబడుల ఆవశ్యకతను గుర్తించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. నగరంలో బుధవారం నిర్వహించిన ఎడ్యుకేషన్‌ ఎమినెన్స్‌ కాన్‌క్లేవ్‌–2026లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యను దేశ నిర్మాణానికి పునాదిగా అభివర్ణించారు. బలమైన విజ్ఞాన వ్యవస్థ, సృజనాత్మకత, మానవ మేధస్సు ఆధునిక యుగంలోని సాధికార సమాజానికి ప్రామాణికలుగా పేర్కొన్నారు. విద్య అనేది ఆవిష్కరణలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహిస్తూ వ్యక్తులను విజ్ఞానవంతులుగా, బాధ్యతాయుతంగా, ఉత్పాదక పౌరులుగా తీర్చిదిద్దుతుందని గవర్నర్‌ అన్నారు. పేదరికం నిర్మూలించి సమాజంలో అసమానతలను తొలగించడంలో విద్య సహాయపడి యువతలో విమర్శనాత్మక ఆలోచనా విధానం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ జాతీయ విద్యా విధానం –2020ని సమగ్రంగా అమలు చేస్తున్నందుకు గవర్నర్‌ ప్రశంసించారు. మాతృభాష ఆధారిత అభ్యసనం, డిజిటల్‌ సాధికారత, బహుళ రంగాల విద్య, నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే తరాన్ని తయారుచేయడంలో ఒక దార్శనిక విధానాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. వరల్డ్‌ స్కిల్‌ సెంటర్‌ వంటి సంస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వర్ధమాన రంగాలలో నాయకత్వం కోసం యువతను సిద్ధం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆవిష్కరణలను ప్రోత్సహించి పరిశోధనలను వెలుగులోకి తెచ్చే అభ్యసనాన్ని సామాజిక అవసరాలతో అనుసంధానించే ఒక వ్యవస్థను ఆవిష్కరించేందుకు విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, పరిశోధనా సంస్థలు, విధాన రూపకర్తలు కలిసి పనిచేయాలని గవర్నర్‌ కోరారు. కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపద్‌ చంద్ర స్వంయి, రోటరీ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ మనోజ్‌ కుమార్‌ త్రిపాఠి, న్యూస్‌ – 18 ఒడియా ఎడిటర్‌ నరేంద్రనాథ్‌ జెనా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement