● పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల్లో
అక్రమాలు జరిగాయంటూ
నిరసన ర్యాలీ
జయపురం: జయపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేడీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు స్థానిక మునిపల్ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్‌ను ఘెరావ్ చేశారు. అనంతరం కార్యాలయం వద్ద ధర్నా జరిపారు. కౌన్సిలర్లతో పాటు ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు, బీజేడీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను అడ్రాస్ చేస్తూ వినతి పత్రాన్ని కార్యనిర్వాహక అధికారికి అందజేశారు. పారిశుద్ధ టెండర్లలో అక్రమాలు జరిగాయని, కౌన్సిల్ ఆమోదం లేకుండా నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు కొందరు పాల్పడుతున్నారన్నారు. ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని ఆరోపించారు. తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమాలపై చర్య తీసుకొనేంత వరకు పారిశుద్ధ్య పనుల కంట్రాక్ట్ కోసం ఎటువంటి కొత్త అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే మున్సిపాలిటీలో పారదర్శకత పెంచాలని, ప్రజల ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య టెండర్ ప్రక్రియను రద్దు చేయాలన్నారు. ధర్నా సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఆందోళనకారులతో మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మూడు రోజుల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై చర్చిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునీత, కౌన్సిలర్లు దేవేంద్రచౌదరి, పార్ధశారది మల్లిక్, ఎస్‌పాల్ సింగ్, సింహాచల బిశాయి, విష్ణు వర్ధన రెడ్డి, ఎన్.లక్ష్మీనారాయణ, సుస్మ మహాపాత్రో, ఎ.భద్రవేణి, శశిరేఖ పొరజ, అజిత్ బెహర, అర్పిత షొడంగి, అనిత రాయ్, ఉర్మిళ మహంకుడొ పాల్గొన్నారు.


