డాక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రోకు సీడీఎంఓ బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రోకు సీడీఎంఓ బాధ్యతలు

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

గోడ కూలి బాలిక దుర్మరణం

రాయగడ: జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రాజెక్టు మేనేజరుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ప్రశాంతకుమార్‌ మిశ్రోకు జిల్లా ముఖ్యవైద్యాధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకూ ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ బి.సరోజినిదేవి ఉద్యోగ విరమణ చేయడంతో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు మిశ్రోను సీడీఎంవోగా విధులు నిర్వహించాలని ఉత్వర్యులు జారీ చేసింది. ఈ సందర్భంగా జాతీయ స్వస్థ్య మిషన్‌ జిల్లా ప్రాజెక్టు అధికారి లక్ష్మకాంత్‌ మహాపాత్రో తదితరులు మిశ్రోక్‌ పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు.

ఎస్‌బీఐ సీఎంకు పదోన్నతి

రాయగడ: స్థానిక ఎస్‌బీఐ ఏడీబీ శాఖలో చీఫ్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సురేంద్ర కుమార్‌ జాల్‌కు పదోన్నతి దక్కింది. ఆయనకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉద్యోగోన్నతి క ల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక బ్యాంక్‌ సిబ్బంది సోమవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బంది పి.శ్రీనివాస్‌ పట్నాయక్‌, సుమిత్‌ రాయ్‌, కిరణ్‌ సబర్‌, అరవింద పరిక, సునిత టప్ప, ఎస్‌.మహారణ, మజ్జి సాహు తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు. ఎస్‌బీఐ శాఖ పరిధిలోని ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి ఈ సందర్భంగా సురేంద్ర కుమార్‌ జాల్‌ సూచించారు.

ఎంసీసీ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం

జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధి కుంభారి సాహిలో ఉన్న మున్సిపాలిటీ వారి ఎంసీసీ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో ఎంసీసీ కేంద్రంలో ఉన్న విలువైన సామగ్రి, యంత్ర పరికరాలు కాలి బూడిదయ్యాయి. ఎంసీసీ కేంద్రంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఎగిసి పడటంతో స్థానికులు వెంటనే అగ్ని మాపక విభాగానికి తెలియజేశారు. అగ్ని మాపక సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకొని మంటలను అర్పారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందీ తెలియలేదు. ఎంసీసీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై మున్సిపాలిటీ దర్యాప్తు ప్రారంభించింది.

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి పాత ఘొసరడ గ్రామంలో లొబో హరిజన్‌ ఇంటి గోడ పై పిడుగు పడగా ఆ గోడ కూలి ఇంద్ర హరిజన్‌ కుమార్తె సరస్వతీ హరిజన్‌(13)పై పడి ఆమె మృతి చెందింది. ఈ సంఘటన ఆమె కుటుంబాన్నే కాకుండా గ్రామ వాసులను శోకంలో ముంచింది. ఆ గ్రామంలో ఇంద్ర హరిజన్‌ కుమార్తె సరస్వతీ హరిజన్‌ గుండాలి ఆదర్శ విద్యాలయంలో 7 వ తరగతి చదువుతోంది. ఆమె తన గ్రామంలో ఉంటున్న మామ లొబొ హరిజన్‌ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి వెనుక ఆరవేసిన బట్టలను తీసేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఉరుములు, గాలులతో వర్షం ఆరంభమైంది. వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. ఆ ధాటికి ఇంటి వెనుక ఓ గోడ కూలి సరస్వతి తలపై పడింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూచిన వెంటనే బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసి వెంటనే సరస్వతి హరిజన్‌ను జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కానీ బాలిక అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొయిపరిగుడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement