రాయగడ: రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రోడ్డు భద్రతా కమిటీ అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఎక్కడబడితే అక్కడ నిలిపివేయడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి అనధికార పార్కింగ్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను నిలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధితశాఖ అధికారులకు ఆదేశించారు. అందుకు ప్రత్యేకమైన ఎన్‌ఫొర్స్‌మెంట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణంలో సీపీ కెమెరాల వ్వవస్థ మరింత మెరుగుపరచాలని సమావేశంలొ పాల్గొన్న ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సూచించారు. దీనిపై మున్సిపాలిటీ యంత్రాంగం స్పందించాలన్నారు. గత మూడేళ్లలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను ఆర్టీఓ వినయ్ కుమార్ వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ లేకుండా నడపడమే కారణమన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై తరచూ జరిమానాలు వేయడంతోపాటు వారికి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, ఏడీఎం నవీన్‌చంద్ర నాయక్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.


