● ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, వారికి రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీలపై జరిగే దాడుల విషయంలో పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. గిరిజన ఉద్యోగులపై పని ప్రదేశాల్లో వేధింపులు జరిగితే సహించేది లేదన్నారు. ఐటీడీఏ పరిధిలోని పనులన్నింటిలోనూ గిరిజనులకే తొలి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. గిరిజనుల ముసుగులో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై, అక్రమంగా సంఘాలు నడుపుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కలర్ గ్రానైట్ పర్మిషన్ల అంశంపై చర్చిస్తూ గిరిజనులకు ఇబ్బంది కలిగించే వారి లీజులపై పునః సమీక్షించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో ఎస్టీలపై దాడులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతేడాది 5 కేసులు నమోదయ్యాయని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలపై ఐటీడీఏ పీవో స్వప్నల్ పవార్‌తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఎస్టీ కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.అన్నాదొర, గిరిజన సంఘాల నేతలు చౌదరి లక్ష్మీనారాయణ, గేదెల రమణమూర్తి, బిడ్డిక తేజేశ్వరరావు, సవర కుమారి, సవర తులసి, ధరణి బైరిసింగి, బి.పాపారావు తదితరులు పాల్గొన్నారు.


