న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
శ్రీ జగన్నాథుని..
భువనేశ్వర్:
పూరీ శ్రీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలో భద్రపరిచిన అమూల్య ఆభరణాల జాబితా తయారీ, ధ్రువీకరణ బృహత్తర ప్రక్రియ బుధవారం నుంచి ఆరంభం అవుతుంది. దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రక్రియ వివరణాత్మక ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) ప్రకారం చేపడుతున్నట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సవివరంగా అనుబంధ వర్గాలకు పూర్తి అవగాహన కల్పించినట్లు వివరించారు. సుదీర్ఘంగా 48 ఏళ్ల విరామం తర్వాత ఈ ప్రక్రియను చేపడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సుముహూర్తం
ఆలయ సంప్రదాయాల ప్రకారం ఈ ప్రక్రియ బుధ వారం మధ్యాహ్నం 12.09 గంటల నుండి 1.45 గంటల మధ్య శుభ ముహూర్తంలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రామాణిక కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆభరణాలను 1978లో తయారు చేసిన జాబితాతో సరిపోల్చడం ద్వారా సమగ్ర ఽధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి ఆభరణాన్ని విడివిడిగా జాగ్రత్తగా పరిశీలించి తూకం వేస్తారు. సరైన డాక్యుమెంటేషన్‌న్ నిర్ధారించడానికి అధికారులు ప్రతి వస్తువును గుర్తించి ట్యాగ్ చేస్తారు. ఈ ప్రక్రియలో ఆభరణాల విలువను నిర్ధారించబోమని అధికారులు స్పష్టం చేశారు. భౌతిక ధ్రువీకరణతో పాటు ప్రతి ఆభరణం సమగ్రమైన, సురక్షితమైన రికార్డును రూపొందించడానికి డిజిటల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, 3డీ మ్యాపింగ్ వంటి ఆధునిక డాక్యుమెంటేషన్ పద్ధతులను ఉపయోగించనున్నారు.
దైనందిన సేవలు యథాతథం
జాబితా ప్రక్రియ సమయంలో దేవతల దైనందిన పూజలు, మతపరమైన ఆచారాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు పూజల పవిత్రతను కాపాడటమే ప్రధాన ధ్యేయమని ఆలయ అధికారులు నొక్కి చెప్పారు.
మహా లఘు దర్శనం
ఈ నేపథ్యంలో భక్తులకు మహా లఘు దర్శనం వెలుపలి వాకిలి నుంచి కల్పిస్తారు. భక్తులకు నిరవధికంగా సర్వ దర్శనం కల్పించడం ఈ చొరవ లక్ష్యంగా పేర్కొన్నారు.


