జయపురం: ఆదివారం రాత్రి జయపురం సమితి పాత్రోపుట్ గ్రామ సమీపంలో తురిడిపుట్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతి చెందిన యువకులు జయపురం పట్టణం దొబాసాహికి చెందిన లాలు ఖొరా, పీతు జానిలుగా గుర్తించారు. రాంచీ–విజయవాడ 326 జాతీయ కారిడార్ మార్గంలో ఒక బొలేరో వాహనం లాలు ఖొరా, పీతు జానిలు వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని బైక్ పై వస్తున్న ఇద్దరు సంఘటన స్థలం వద్దనే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే జయపురం సదర్ పోలీసులు వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం జయపురం ఫూల్‌బెడ లో గల జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. లభించిన సమాచారం ప్రకారం మృతులు లాలు ఖొర, పీతు జానిలు జయపురం సమితి డొంగరచించి గ్రామంలో ఒక డాబా హొటల్‌లో పని చేస్తున్నారు. గత రాత్రి పని ముగించుకొని బైక్ పై జయపురం వస్తుండగా మార్గంలో తురిడిపుట్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ చేరుకుని మృతదేహాలు చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం మృతుల కుటుంబాల సభ్యులు బంధువులు జయపురం సదర్ పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించి మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఆందోళన చేపట్టారు.


